Manchu Manoj: దండం పెడతా.. ఆపండి

ABN , Publish Date - Dec 11 , 2024 | 02:51 PM

మా నాన్నా దేవుడు. ఆయనను కొంతమంది ప్రభావితం చేస్తున్నారు అంటూ మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మంచు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సీపీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు నోటీసులు ఇచ్చారు. బుధవారం 10.30కు విచారణకు రావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మంచు మనోజ్ బుధవారం నాడు నేరేడ్‌మెట్‌‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు విచారణకు హాజరయ్యారు. సీపీ సుధీర్ బాబు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..


దాదాపు గంటన్నర జరిగిన విచారణ అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ' సీపీ గారిని కలిశా న్యాయం చేస్తానని తెలిపారు. ఒక భరోసాతో ఇంటికి వెళ్తున్న. వ్యవస్థ న్యాయం వైపు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఇక ఏ గొడవ ఉండదని భావిస్తున్న. శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకోవడానికి సిద్ధం. మా అమ్మ హాస్పిటల్ లో చేరిందని అసత్య ప్రచారాలు చేశారు. కానీ.. ఆమె నా భార్య, కూతురితో ఇంట్లోనే ఉన్నారు. నా కూతురు, భార్య పేరును కూడా ఇన్వాల్వ్ చేశారు. దండం పెడుతా నా తల్లి పేరును అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి. విద్యానికేతన్ లో జరిగిన అక్రమాల పైన ప్రశ్నించడంతోటే నన్ను టార్గెట్ చేశారు. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగించవద్దని సీపీ ఆదేశించారు. నేను మరోసారి ఇంటి వద్ద గొడవలు పడడం,శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ చేయనని హామీ ఇచ్చాను. నేను ఫిర్యాదు చేసిన కేసులో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని కోరాను. నా ఫిర్యాదు పైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరాను. మా నాన్నా దేవుడు. ఆయనను కొంతమంది ప్రభావితం చేస్తున్నారు' అంటూ పేర్కొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 02:51 PM