Manchu Manoj: ఆ వివరాలన్నీ చెబుతాను.. మీడియా ముందుకు మనోజ్
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:12 AM
మంచు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడి నిమిత్తం జర్నలిస్ట్ సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాకు మంచు మనోజ్ సపోర్ట్ అందిస్తూ.. తన తండ్రి తరపున సారీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
తను కుటుంబంలో అసలు ఏం జరుగుతుందనేది పూర్తిగా వివరాలతో సహా తెలుపుతానని అన్నారు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి, జర్నలిస్ట్‌లు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. జర్నలిస్ట్ సోదరులు ఎవరైతే గాయపడ్డారో వారికి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ చెబుతున్నాను. నేను మీ తమ్ముడు అనుకోండి.. మీ వాడిని అనుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ చేయడానికైనా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీకు ఇలా జరగడం.. చాలా బాధగా ఉంది. నా భార్య పేరు, ఏడు నెలల కుమార్తె పేరు ఇందులోకి లాగుతున్నారు. నేనేం అడగలేదు.. నా సొంతంగా నేను బతుకుతున్నాను. నా భార్య కూడా వాళ్ల ఇంట్లో నుండి ఏం తీసుకురాలేదు.. ఏం అడగలేదు కూడా. నేను ఇంట్లో డబ్బు, ఆస్తి అడగలేదు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మా అంకుల్, మా నాన్న స్నేహితులు ‘మనోజ్.. మీ నాన్నగారు, అమ్మగారు ఒక్కరే ఉంటున్నారు. మీ అన్న దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యాడు. నీ భార్య గర్భవతి, తనకు తల్లిదండ్రులు లేరు. తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది. పెద్దల అవసరం ఉంది. నువ్వు ఒక్కడివి ఎలా చూసుకుంటావ్..’ అని చెబితే.. నా భార్య కూడా అంతమంది చెబుతున్నారు కదా వెళతాం అంటే.. సరే నీకోసం వెళదాం అని చెప్పి.. ఇంటికి తిరిగి రావడం జరిగింది.
ఈ రోజు నాపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారంటే.. అందుకే నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలను. వాళ్లు ఒకటి చెప్పి, నేను ఒకి చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఎప్పటి నుండో కూర్చోని మాట్లాడదామని అంటున్నాను. స్కూల్ పిల్లలు, అక్కడి చుట్టు ప్రక్కల గ్రామాల వారంతా మావాళ్లే.. వాళ్లంతా నాకు ఆర్జీలు పంపుతుంటే.. వినయ్ అతనికి కాల్ చేసి, అసలేమైంది.. వాళ్లకి న్యాయం చేయండి.. కావాలంటే నేను కాళ్లమీద పడి అడుగుతాను.. వాళ్లకి ఉన్న ఇష్యూ క్లియర్ చేయండి అని అడుగుతుంటే.. చాలా దురుసుగా ఆన్సర్ చేశారు. నేను ప్రతీది ఈ రోజు (బుధవారం) సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి ప్రతీది చెప్పేస్తాను. ఇన్నాళ్లూ ఆగాను కానీ.. ఇక ఓపిక పట్టలేను.
మా ఇంటికి 108 ఎందుకు వచ్చిందీ అనేది పోలీసు వాళ్లకి కూడా తెలుసు. ఇంకా నేను ఏదో కొడుతున్నానని అంటున్నారు కదా.. సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూడండి. అసలు ఏం జరుగుతుందో మీకు కూడా తెలుస్తుంది. కిరణ్, విజయ్ వాళ్లని ఎంక్వయిరీ చేయండి.. వాళ్లే దొంగతనం చేశారని చెప్పాను. మొన్న చెబితే మేం చూసుకుంటామని అన్నారు. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరుగుతూ.. మా వర్కర్స్‌ని బెదిరించి నిన్న ఒక అమ్మాయి పారిపోయేలా చేశారు. నా బిడ్డ బట్టలు సర్దడానికి ప్రయత్నించాడు తను. పిల్లలు జోలికి వెళితే భయపడతాం కదా. అందుకే డీజీపీ దగ్గరకు వెళ్లాను.
నాకు మా నాన్న దేవుడు. ఇప్పుడు అంతా చూస్తున్న మా నాన్న.. మా నాన్న కాదండి. నేను అబద్దాలు ఆడేవాడిని కాదు. నా గురించి ఎవరినైనా ఎంక్వయిరీ చేసుకోండి. నా ఫ్రెండ్స్‌ని కూడా కనుక్కోండి...’’ అని చెప్పుకొచ్చారు.
Also Read-Manchu Family Dispute: తలకు గాయం.. హాస్పిటల్‌లో మోహన్ బాబు
Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్
Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి