'కన్నప్ప’లో మోహన్‌బాబు మనవరాళ్లు.. ఇదిగో ఫస్ట్ లుక్
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:33 PM
కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అలరించేందుకు సిద్థమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కన్నప్ప’లో విష్ణు కుమారుడు అవ్రామ్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ తిన్నడుగా నటించనున్నాడు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్రను పోషించనున్నాడు. తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
‘‘కన్నప్ప’తో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ పెట్టారు. ‘‘కన్నప్ప’లో నా కూతుళ్లు నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా చిన్న మమ్మీలు (అరియానా, వివియానా) తెరపై సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు.
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ రూపొందుతోంది. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘మహాభారత్’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత.