KTR: అల్లు అర్జున్ అరెస్ట్.. అభద్రతా భావానికి పరాకాష్ట

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:18 PM

అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ రియాక్టయ్యారు..

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను (Hero Allu Arjun) పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్‌ అవడం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


కాగా.. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీ పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు (శుక్రవారం) అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్‌ను ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు. మరికాసేపట్లో అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే నాంపల్లి కోర్టు వద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.


మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను న్యాయవాదులు కోరారు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి మెన్షన్ చేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. పోలీసులను అడిగి 2:30 గంటలకు చెబతామని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది.

Updated Date - Dec 13 , 2024 | 02:18 PM