Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:33 PM
ఒకవైపు నాగచైతన్య పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు అఖిల్ నిశ్చితార్థం కూడా అయినట్లుగా ఎక్స్ ద్వారా కింగ్ నాగ్ షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఏ తండ్రికైనా తన బిడ్డలకు పెళ్లి చేసి వారిని సంతోషంగా చూడాలని ఉంటుంది. ఇప్పుడు కింగ్ నాగార్జున అదే పనిలో ఉన్నారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య విడాకుల అనంతరం డిప్రెషన్‌కి వెళ్లినట్లుగా నాగార్జున ఆ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. చైతూని అలా చూసి చాలా బాధగా ఉండేదని చెప్పారు నాగ్. ఇప్పుడు నాగ చైతన్య, శోభితను వివాహం చేసుకోబోతుండటంతో.. ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నారు. చైతూ-శోభితల నిశ్చితార్థానికి సంబంధించి ఫస్ట్ అధికారికంగా ప్రకటించింది కూడా కింగ్ నాగార్జునే.
Also Read- Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కై.. నేను చేయాల్సింది చేస్తా..
ఇక రెండో కుమారుడు అఖిల్ విషయంలోనూ నాగ్ ఎంతో బాధని అనుభవించారు. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత అఖిల్ పెళ్లి అనూహ్యంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి అఖిల్ విషయంలో నాగార్జున చాలా వర్రీ అవుతున్నారు. ఇప్పుడిక ఆ వర్రీ కూడా లేదు. ఎందుకంటే, తాజాగా కింగ్ నాగార్జునే తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం కూడా పూర్తయిందంటూ అధికారికంగా ఎక్స్ వేదికగా తెలిపారు. జైనాబ్ రావుద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం అయినట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషం.. యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి ప్రేమకు, ఆనందానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు నాగార్జున. అంతేకాదు, కాబోయే నూతన జంట ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.
డిసెంబర్ 4న శోభితతో నాగ చైతన్య వివాహం జరుగుతుండగా.. అంతా ఆ సంబరాల్లో మునిగిపోయారు. సడెన్‌గా ఇప్పుడు అఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే వార్తతో అక్కినేని అభిమానులకు కింగ్ నాగ్ డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఇక అఖిల్ (Akhil Akkineni) నిశ్చితార్థం విషయానికి వస్తే.. జైనాబ్ రావుద్జీతో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితులైన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా.. ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్‌కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం. వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంటిలో జరిగినా.. వివాహానికి సంబంధించి ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదని తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది ఉంటుందని అక్కినేని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతోన్న చైతూ-శోభితలకు, అలాగే నిశ్చితార్థం ముగించుకుని పెళ్లికి సిద్ధమవుతోన్న అఖిల్- జైనాబ్ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.