Khadgam: 22 ఏళ్ల తర్వాత ఖడ్గం రీ రిలీజ్.. కృష్ణవంశీ ఏమన్నారంటే
ABN , Publish Date - Oct 05 , 2024 | 01:52 PM
హీరో శ్రీకాంత్‌ని వద్దనుకున్న చిత్రం, నటుడు శివాజీ రాజా చేయనని చెప్పిన చిత్రం, భారతదేశం గర్వంగా చెప్పుకునే చిత్రం ‘ఖడ్గం’. ఈ సినిమా దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర టీమ్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’ (Khadgam). ఈ సినిమా అప్పట్లో ఎటువంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పటికే ఇండిపెండెన్స్ డే సమయంలో ఈ సినిమాను ఖచ్చితంగా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణంలో చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు దర్శకుడు కృష్ణవంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. (Khadgam Ready to Re Release)
Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్
ఈ కార్యక్రమంలో దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. మాకు ఈ సినిమా తీయడంలో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం. ఈ సినిమాకి సహకరించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా బ్రహ్మండంగా ఆదరణ పొందుతుందని భావిస్తున్నానని అన్నారు. నటుడు షఫీ మాట్లాడుతూ.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి నా వనవాసంకి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలని చెప్పారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. నిర్మాత మధు మురళిగారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఈ సినిమా చేసినందుకు థాంక్స్. ఇటీవలే ‘మురారి’ పండుగ చేసుకున్నాం. ఇప్పుడు ‘ఖడ్గం’ రీ రిలీజ్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పట్లో ఈ సినిమాలో చేయనని చెప్పాను. కానీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటిలో మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రంగా ఈ సినిమా నా జీవితంలో నిలబడిందని తెలిపారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనరేషన్స్ మారినా పెట్రియాటిక్ ఫిల్మ్స్ అన్నింటిలో ‘ఖడ్గం’ చాలా గొప్ప చిత్రం. అసలు ‘ఖడ్గం’ సినిమాలో నిర్మాత మధు మురళి నన్ను వద్దు అన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్‌లో ఈ సినిమాను మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. కాగా, అక్టోబర్ 18న ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది.