Jr NTR ఇంటి స్థలంపై వివాదం.. హైకోర్టులో పిటిషన్! జూన్ 6కు వాయిదా
ABN , Publish Date - May 17 , 2024 | 10:45 AM
తన ఇంటి స్థలంపై వివాదం తలెత్తడంతో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్టప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు.
గత కొంత కాలంగా తన ఇంటి స్థలంపై జరుగుతున్న వివాదం విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. తాను ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుగోలు చేశానని, చట్టప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టానని జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నారు.
కానీ ఆ భూమిని ఎన్టీఆర్ (Jr NTR)కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనాఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండ్‌సఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన డీఆర్‌టీ.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బ్యాంకుల నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డీఆర్‌టీలో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డీఆర్‌టీ ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది.
దాంతో ఎన్టీఆర్ (Jr NTR) ఫిర్యాదు మేరకు భూమి అమ్మిన గీతపై కేసు నమోదు అయింది. మరోవైపు డీఆర్‌టీ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జే.శ్రీనివా్‌సరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డీఆర్‌టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.