Devara: ‘దేవర’ సినిమా చూస్తూ.. అభిమాని మృతి
ABN , Publish Date - Sep 27 , 2024 | 01:19 PM
‘దేవర’ సినిమా విడుదల వేల కడపలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా చూస్తూ ఓ అభిమాని కుప్పకూలి చనిపోయాడు.
యంగ్‌టైగర్ జూ.ఎన్టీఆర్ (Junior NTR) నటించిన ‘దేవర’ సినిమా (Devara Movie) నేడు థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. గత మూడేళ్లుగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం థియేటర్లలోకి రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు థియేటర్ల బాట పట్టారు. అదే విధంగా ఓ అభిమాని కూడా ఎన్టీఆర్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేస్తూ ఒక్కసారి కూప్పకూలిపోయాడు. అనుహ్యంగా ఒక్కసారిగా జరిగిన ఓ ఘటనతో థియోటర్లోని ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
నగరంలోని అప్సర థియేటర్‌లో ‘దేవర’ చిత్రం విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న క్రమంలో ఓ అభిమాని కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాను చూసేందుకు వచ్చిన అభిమాని ఇలా హఠాన్మరణం చెందడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. మస్తాన్ వలి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటా శివ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం దేవర ఈరోజు (శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.