నన్ను కష్టపెట్టగలరేమో కానీ, భయపెట్టలేరు: నిర్మాత అనిల్ సుంకర
ABN , Publish Date - Feb 15 , 2024 | 06:18 PM
తనని న్యాయపరమైన చిక్కులతో కష్టపెట్టాలని అనుకుంటున్నారు అని, కానీ తాను ఎవరికీ భయపడను అని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. నిర్మాతగా తాను నష్టపోయాను అని, అతను నష్టపోయాడు అని, అయినా అతని మీద కోపం లేదని, చేయాలనుకున్నప్పుడు అతనికి ఏదైనా మంచి చేస్తాను అని చెప్పారు అనిల్.
నిర్మాత అనిల్ సుంకర ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఫాంటసీ, సూపర్ నేచురల్ నేపథ్యంలో వచ్చే 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా రేపు శుక్రవారం విడుదలవుతోంది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ లీడ్ పాత్రలలో నటించారు. విఐ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో వేశారు, దానికి మంచి స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా ఈరోజు ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. అలాగే ఈ 'ఊరు పేరు భైరవకోన' సినిమా ప్రదర్శన నిలిపివేయాలని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ అనే అతను కోర్టుకు వెళ్లడం జరిగింది, కానీ కోర్టు ఈ సినిమాని ఆపేయాలని మాత్రం చెప్పలేదు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా నిర్మాత అనిల్ సుంకర తన సినిమా విడుదలైనప్పుడల్లా ఇదే వ్యక్తి నుండి న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటూ వున్నారు.
అదే విషయాలన్నీ అనిల్ ని అడిగితే, "సినిమా నిర్మాతగా నేను నష్టపోయాను, అతను కూడా నష్టపోయాడు. నేను అయితే నష్టపరిహారం ఏమీ ఇవ్వనక్కరలేదు, కానీ అతను నన్నే ఎప్పుడూ నిందించడానికి చూస్తున్నారు. ఏదైనా రంగంలో వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలు రెండూ ఉంటాయి, లాభం వచ్చినప్పుడు నాది గొప్పని, నష్టం వచ్చినప్పుడు అవతలివారి తప్పు అని నిందించటం సరికాదు. నన్ను ఆపటానికి ఎదో చేద్దాం అనుకుంటున్నారు కానీ, నేను ఎవరికీ భయపడను," అని చెప్పారు అనిల్ సుంకర. నన్ను ఇలా న్యాయపరమైన చిక్కులతో కష్టపడగలరేమో కానీ, భయపెట్టలేరు అని చెప్పారు అనిల్.
ఇలా కోర్టులకి వెళ్లడం వలన ఏమవుతుంది, న్యాయవాదులకు ఫీజులు ఇచ్చుకుంటూ పోవాలి, వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. అతనికి లక్ష పోతే, నాకూ లక్ష పోతుంది ఈ న్యాయపరమైన చిక్కులతో న్యాయవాదులకు ఇచ్చే రుసుము వలన, అంతేకానీ ఇద్దరికీ ఉపయోగం ఏమీ ఉండదు. ఇలా చేస్తున్నాడు అని అతనిమీద నాకు కోపంగానీ, పగ కానీ, ద్వేషంగానీ లేదు, అయితే ఇంత చేస్తున్నా అతనికి తరువాత ఏదైనా మంచి చెయ్యాలి అనుకుంటే చేస్తాను, అని చెప్పారు అనిల్ సుంకర.