RGV: వర్మపై చర్యలు వద్దు.. ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
ABN , Publish Date - Dec 02 , 2024 | 06:20 PM
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఇంతకీ ఏమైందంటే..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు భారీ ఊరటని ఇచ్చింది. ఆయనపై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ.. 'తనపై పోలీసులు కేసు నమోదు చేయకుండా చూడాలని అలాగే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. అలాగే వచ్చే సోమవారంలోగ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వర్మ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ.. పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని.. తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రామ్‌గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.