Devara: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కి పండగే!
ABN , Publish Date - Sep 21 , 2024 | 01:14 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’కు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, అలాగే అదనపు షోలకు అనుమతిని ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ‘దేవర’కు వచ్చిన అనుమతులు ఏంటంటే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’కు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు విడుదల రోజు, ఆ తర్వాత ఓ వారం, పదిరోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, అలాగే స్పెషల్ షోల అనుమతిని రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దేవర’ సినిమాకు కూడా అదనపు షోలకు, అలాగే టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటును కలిగిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం.. ‘దేవర’ సినిమా టికెట్ల రేటు పెంపు మరియు ఎక్స్‌ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులను మంజూరు చేయటం జరిగింది. అదనపు ప్రదర్శనల విషయానికి వస్తే.. తొలిరోజు (విడుదల రోజు) 6 షోలకు (అర్థరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం), ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇవ్వడం జరిగింది. టికెట్ల రేటు విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 135, సింగిల్ స్ర్కీన్ అప్పర్ క్లాస్ రూ. 110, లోయర్ క్లాస్ రూ. 60 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ల ధర పెంపుతో పాటు, ఎక్స్‌ట్రా షోలతో ‘దేవర’ సరికొత్త రికార్డులను బాక్సాఫీస్‌కు పరిచయం చేయనుందంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రముఖ తారాగణం ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ అంటూ మేకర్స్ కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇక అదనపు షోలు, అలాగే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి.. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
అలాగే చిత్ర నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.