Pushpa 2 Team: శ్రీతేజ్ కుటుంబానికి ‘పుష్ప’ టీమ్ రూ. 2 కోట్ల పరిహారం
ABN , Publish Date - Dec 25 , 2024 | 02:39 PM
Sandhya Theatre Stampede: 'పుష్ప 2' ప్రీమియర్స్ సందర్భంగా ఈ నెల 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్(9) గాయపడిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ‘పుష్ప 2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటనలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూసేందుకు బుధవారం అల్లు అరవింద్, నిర్మాత దిల్ రాజు హాస్పిటల్‌కు చేరుకున్నారు. శ్రీతేజ్‌ని పరామర్శించిన అనంతరం.. శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ అమౌంట్‌ని శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు. అతనికి వెంటిలేటర్ తీసేశారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నాం. అల్లు అర్జున్ నుంచి రూ. కోటి రూపాయలు, ‘పుష్ప 2’ నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ రూ. 50 లక్షల రూపాయలను మొత్తంగా రూ. 2 కోట్ల రూపాయలను ఎఫ్ డి సి చైర్మెన్ దిల్ రాజుకు అందచేయడం జరిగింది’’ అని తెలిపారు.
పావులు కదుపుతున్న దిల్ రాజు
దిల్ రాజు మాట్లాడుతూ.. 'గురువారం సినీ ప్రముఖులందరం సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నాం. సీఎం రేవంత్ సినీ పరిశ్రమకి, ప్రభుత్వానికి వారధిగా ఉండమని నన్ను కోరారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. 72 గంటల నుండి వెంటిలేటర్ లేకుండానే చికిత్స అందిస్తున్నారు' అని తెలిపారు.