సోలో రిలీజ్... మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి: ఈగల్ నిర్మాతలు

ABN , Publish Date - Jan 19 , 2024 | 12:18 PM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, ఫిబ్రవరి 9న విడుదల అవుతున్న తమ సినిమా 'ఈగల్' కి సోలోగా విడుదలకి అవకాశం ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతలు ఛాంబర్ కి ఈరోజు ఒక లెటర్ పంపారు.

సోలో రిలీజ్... మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి: ఈగల్ నిర్మాతలు
Ravi Teja from Eagle

సంక్రాంతి పండగకి ఐదు సినిమాలు పోటీలో ఉంటే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి అందరి నిర్మాతలని పిలిచి మాట్లాడి అందులో రవితేజ నటించిన 'ఈగల్' సినిమాని వాయిదా వేయించారు. ఆ సమయంలోనే ఆ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులకు ఆ సినిమా ఎప్పుడు విడుదలైన సోలోగా విడుదల చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హామీ ఇచ్చింది. (Eagle film producers Peoples Media Factory wrote a letter to Telugu Film Chamber of Commerce of their assurance regarding the film release)

eagle2.jpg

'ఈగల్' సంక్రాంతి పోటీ నుండి తప్పుకొని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. అయితే అదేరోజు చాలా సినిమాలు విడుదలకి వున్నాయి. అందులో రజినీకాంత్ నటించిన 'లాల్ సలామ్', సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', మహి వి రాఘవ రాజకీయ చిత్రం 'యాత్ర 2' (ఫిబ్రవరి 8) విడుదలవుతున్నాయి. మరి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాయా. నిన్న 'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్ విడుదల సందర్భంగా సందీప్ కిషన్ తాను రవితేజ సినిమాకి పోటీగా వస్తున్నాను అని ప్రకటించారు. తన సినిమా విడుదల తేదీ ఎప్పుడో ప్రకటించామని, ఈ తేదీ తప్పితే తాము వేరే తేదీకి రాలేమని కూడా చెప్పాడు.

TFCCletter.jpg

ఇదిలా ఉండగా ఈరోజు 'ఈగల్' సినిమా నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి ఒక లెటర్ పంపింది. "మీరు అప్పుడు మా సినిమాకి సోలోగా విడుదల చేసుకోవటానికి వీలు కల్పిస్తామని మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు చాలా సినిమాలు విడుదలవుతున్నట్టుగా వున్నాయి, మరి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి," అని ఛాంబర్ ని అడుగుతూ లెటర్ పంపారు. మరి దీనికి సమాధానంగా ఫిల్మ్ ఛాంబర్ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి. ఎందుకంటే సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్నప్పుడు, ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు మీడియా సమావేశంలో రవితేజని, నిర్మాతలని ప్రశంసిస్తూ మాట్లాడారు, అలాగే ఆ సినిమాకి సోలోగా విడుదల చేసుకోవటానికి తమ సహాయ సహకారాలు వుంటాయని చెప్పారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రాసిన లెటర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది.

Updated Date - Jan 19 , 2024 | 12:32 PM