Sukumar: మూడు రోజుల నుంచి బాధగా ఉంది.. నా సినిమా కారణంగా ఒక ప్రాణం పోయింది
ABN , Publish Date - Dec 07 , 2024 | 08:55 PM
‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శుక్రవారం అల్లు అర్జున్ స్పందించారు. తాజాగా జరిగిన ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌లో సుకుమార్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
Also Read- Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్
ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు ఇంత విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ముందుగా నేను రాజమౌళిగారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాను ఇంతగా ప్రోత్సహించింది రాజమౌళిగారే. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయాలని ఆయనే సలహా ఇచ్చారు. థియేటర్‌కు వచ్చిన వాళ్ళు 3 గంటలు అంతా మర్చిపోయి సినిమాను చూడాలి అని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. ఫాహద్ ఫాజల్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనెప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో పని చేయడం చాలా అదృష్టం. అలాగే నాకు దొరికిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరికీ దొరికి ఉండరూ. వాళ్ళ జడ్జిమెంట్‌కి చాలా విలువ ఇస్తాను. అలాగే బయట నుండి ఒక రైటర్‌ని నా డైరెక్షన్ టీంలోకి తీసుకున్నాను. ఏమైనా సమస్య వచ్చినా చాలా వేగంగా తీరుస్తారు. తిరుపతి నుండి గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన వారిని తీసుకొచ్చారు నా డైరెక్షన్ టీం. 10 నిమిషాలలో సీన్ రాసే వాళ్ళు ఉన్నారు దర్శకత్వ టీంలో. నా టీంలో ఉన్న వారు అంతా సుకుమార్‌లే. అందరూ నాలాంటి దర్శకులే.
ఈ సినిమా కోసం బ్యాగ్రౌండ్‌లో ఉండి పని చేసిన అందరి కష్టం నాకు తెలుసు. ఈ విజయం కారణం చిత్ర బృందమే. నా టీంలో నా అభిమానులు ఉండటం నా అదృష్టం. సినిమా ఎంత విజయం సాధిస్తుందో నా టీం ముందుగానే లెక్కలతో సహా చెప్పేశారు. హిందీ కూడా నా టీం మీద నమ్మకంతో పూర్తిగా వారికే అప్పగించాను. నా బృందంలో జర్నలిస్టు కూడా ఉండటం విశేషం. ఎడిటర్‌కి స్క్రిప్ట్ ఎడిటింగ్‌పై అవగాహన ఉండటం మాకు చాలా హెల్ప్ అయింది. అలాగే చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు 3 రోజులుగా ఆనందంగా లేదు. ఎందుకంటే జరిగిన ఘటన అలాంటిది. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి తీసినా.. నా సినిమాతో ఒక ప్రాణం పోయింది. దాన్ని తిరిగి తీసుకురాలేము. నా మనసు వికలమైంది.. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం. మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అని అన్నారు.