Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?

ABN , Publish Date - Dec 26 , 2024 | 09:44 AM

టాలీవుడ్‌లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

CM Revanth Reddy and Megastar Chiranjeevi

‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌కు నిద్రలేకుండా చేస్తుంది. ఈ ఘటనని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో.. రోజుకో మలుపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అయితే నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు.. ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు అటు ప్రభుత్వ పెద్దలను, ఇటు సినీ పెద్దలను ఒకచోటకు చేర్చుతున్నారు. ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన తిరిగి రాగానే.. సంధ్య థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని పరామర్శించడంతో పాటు ‘పుష్ప’ టీమ్ నుండి ఆ కుటుంబానికి భారీ పరిహారం అందేలా చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఘటనపై నెలకొన్న పరిణామాలతో పాటు, టాలీవుడ్‌లోని కొన్ని సమస్యల పరిష్కార నిమిత్తం గురువారం సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌తో సినీ ప్రముఖుల భేటీ‌కి ఆయన అధ్యక్షతను తీసుకున్నారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంత టైమ్ ఇచ్చారు? ఎవరెవరు ఈ భేటీలో పాల్గొనబోతున్నారనే వివరాల్లోకి వెళితే..


సంధ్య థియేటర్ ఘటనలో శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చేలా ‘పుష్ప 2’ టీమ్‌ని ఒప్పించారు దిల్ రాజు. బుధవారం అల్లు అరవింద్ ఆ కుర్రాడిని పరామర్శించి వెంటనే మీడియా సమక్షంలో ఆ అమౌంట్‌ని దిల్ రాజుకు అందజేశారు. ఇందులో అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రూ. 50 లక్షలు.. మొత్తంగా రూ. 2 కోట్ల రూపాయలు శ్రీతేజ్ కుటుంబానికి పరిహారంగా ఇచ్చినట్లుగా అల్లు అరవింద్‌తో పాటు దిల్ రాజు కూడా కూడా చెప్పుకొచ్చారు.

వెంటనే ప్రభుత్వ పెద్దలతో సమావేశం

శ్రీతేజ్ కుటుంబానికి భారీ పరిహారం అందేలా చేసిన దిల్ రాజు.. ఆ వెంటనే ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యతో పాటు, ఇతర సమస్యలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. గొడవలు లేకుండా ఫ్రెండ్లీగా అన్నీ పరిష్కరించుకునేందుకు గురువారం ప్రభుత్వ పెద్దలతో భేటీని ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు, గద్దర్ అవార్డ్స్, సంధ్య థియేటర్ ఘటన, బెనిఫిట్ షో‌ల రద్దు, చిన్న మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇంకా ఇతరత్రా విషయాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్


సీఎం ఎంత సమయం ఇచ్చారంటే..

ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి కేవలం గంట నుండి గంటన్నర వరకు మాత్రమే సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంకా మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ వంటివారు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీ అనంతరం కర్ణాటక రాష్ట్రం బెలగావికి వెళ్లాల్సి ఉంది. ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. బెలగావిలో రెండ్రోజులపాటు సీడబ్ల్యూసీ (CWC) సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి వెళ్లనున్నారు.


మెగాస్టార్ చిరంజీవి లేకుండానే..

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీని ఏర్పాటు చేయించిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడారని సమాచారం. ఇక గురువారం సీఎంతో జరిగే భేటీకి టాలీవుడ్ నుండి నిర్మాతలైన.. అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ హాజరుకానున్నారు.


హీరోలలో వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ వంటివారు హాజరు కానున్నారని తెలుస్తుంది. అక్కినేని నాగార్జునను కూడా దిల్ రాజు ఆహ్వానించినట్లుగా సమాచారం. ఇక దర్శకత్వ విభాగం నుండి.. అధ్యక్షుడు వీర శంకర్, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట , త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మలతో పాటు.. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్.. మా అసోసియేషన్ నుంచి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది.

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 10:34 AM