Devara: కొంప ముంచిన.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
ABN , Publish Date - Sep 25 , 2024 | 07:20 AM
'దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడం, ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా నిర్మాణ సంస్థకు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది.
రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) తెరకెక్కించిన 'దేవర’ (Devara) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గత ఆదివారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరపాలని నిర్ణయించగా కెపాసిటీని మించి అభిమానులు, ఆడియన్స్ ఈ ఈవెంట్‌కు హాజరు కావడంతో పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఈవెంట్ రద్దవడం, ఫ్యాన్స్ రెచ్చిపోవడం చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన సదరు నిర్మాణ సంస్థకు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవడంతో ఆగ్రహావేశాలకు గురైన అభిమానులు అక్కడి ఫర్నిచర్ ఇతర సామాగ్రిని బద్దలు కొట్టారు. తోపులాటలో హోటల్‌లో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు కంట్రోల్‌లోకి తీసుకుని చక్కబరిచే ప్రయత్నం చేయగా విఫలమై ఈవెంట్‌నే రద్దు చేశారు. దీంతో ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న హోటల్‌కు భారీ నష్టం చేకూరింది. ఆ నష్టాన్ని చెల్లించాలని నోవాటెల్ యాజమాన్యం కోరడంతో ఇప్పుడు నిర్మాతలు ఆ నష్టాన్ని తీర్చేందుకు బేరాలాడటం విశేషం.
ఆరేళ్ళ తరువాత జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) సోలో రిలీజ్ గా వస్తున్న దేవర మూవీ కోసం అభిమానులు ఎంతో వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై తమ అభిమాన హీరో స్పీచ్ వినాలని అభిమానులు సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. ఇంకా కొన్ని గంటల్లోనే తమ అభిమాన నటుడి రాక గురుంచి అప్డేట్ వస్తుందనుకున్న సమయంలో ఈవెంట్ క్యాన్సల్ అనే అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అభిమానులు కుర్చీలు ఇతర కనిపించిన సామాగ్రి పగలగొట్టారు. కాగా, ఇప్పుడు నష్టాన్ని అంచనా వేసిన హోటల్ యాజమాన్యం 33 లక్షలని లెక్కలు తేల్చింది. ప్రధానంగా కుర్చీలకే రూ.7లక్షల వరకు అయినట్లు తెలుస్తోంది. అలాగే మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. దీంతో మొత్తంగా రూ. 33 లక్షల ఆస్థి నష్టం జరిగిందట. కాగా , ఈ బిల్లుని కాస్త తగ్గించాలని నిర్మాణ సంస్థ ఇప్పుడు బేరాలకు దిగింది.