Delhi Ganesh: ఢిల్లీ గణేష్‌-చిరంజీవి అనుబంధం తెలుసా

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:12 AM

ప్రముఖ దివంగత కోలీవుడ్ లెజండరీ యాక్టర్ ఢిల్లీ గణేష్‌‌కి చిరంజీవికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక ఢిల్లీ గణేష్‌ కెరీర్‌లో కమల్ హాసన్ కీలక పాత్రా పోషించారు. ఇంతకీ ఆ సంబంధం ఏంటంటే..

ఇటీవల కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేష్‌ (Delhi Ganesh)కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా వృద్థాప్య సమస్యలతో బాధపడుతున్న ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని ఆయనకు శోక హృదయాలతో నివాళి ప్రకటించాయి. అయితే ఆయనకు చిరంజీవితో, తెలుగు సినిమా ఇండస్ట్రీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటంటే..


ఆయన మెగాస్టార్ చిరంజీవికి గాత్రదానం చేసిన వ్యక్తి. 1981లో కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ‘47 రోజులు’ అనే సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తీశారు. ఈ చిత్రానికి తమిళ్ లో చిరంజీవికి ఢిల్లీ గణేష్‌ డబ్బింగ్ చెప్పారు. ఇక రాఘవేందర్ రావు సెన్సేషన్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాని తమిళ్‌లో ‘కాదల్ దేవతై’(ప్రేమ దేవత)గా అనువదించి రిలీజ్ చేశారు. దీనికి ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. ఈ విధంగా ఆయన చిరంజీవికి రెండు సార్లు గాత్రదానం చేశారు.


కమల్‌తో అనుబంధం

ఢిల్లీ గణేష్ కమిటెడ్ ఆర్టిస్టు. అయితే కోలీవుడ్ ఆయనను చాలా కాలం లిమిటెడ్ ఆర్టిస్టుగానే గుర్తించింది‌. 1981లో ‘ఎంగమ్మా మహారాణి’ సినిమాలో హీరోగా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో పరిశ్రమ ఆయనకు సహాయక పాత్ర, ఇంటి పెద్ద పాత్ర లేదంటే హీరోకు అన్న, బావ.. ఇలాంటి పాత్రలే ఇస్తూ వచ్చింది. కానీ ఆయనలో అంతకుమించిన ప్రతిభ ఉంది. అప్పుడొచ్చారో నటుడు కమల్‌హాసన్.

kamalhasaan and delhi ganesh.jpg


‘ఇతను గొప్ప నటుడు. ఇతనిలో అన్ని రకాల పాత్రలూ వేసే ప్రతిభ ఉంది’ అని గుర్తించారు కమల్‌. తన సినిమాల్లో ఆయనకో పాత్ర ఉండేలా చూసుకున్నారు. అలా 1981లో ‘రాజాపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) సినిమాతో మొదలుపెట్టి, ఆ తర్వాత కమల్‌హాసన్ నటించిన అనేక సినిమాల్లో ఢిల్లీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ‘నాయగన్’, ‘మైకేల్ మదన కామరాజన్’, ‘అవ్వై షణ్ముగి’ (తెలుగులో ‘భామనే సత్యభామనే’), ‘తెనాలి’.. ఇలాంటి చిత్రాలతో ఢిల్లీ గణేష్ ప్రతిభ అందరికీ తెలిసింది. ‘అవ్వై షణ్ముగి’ సినిమాలో కమల్‌హాసన్, జెమినీ గణేశన్‌తో సరిసమానంగా ఉండే పాత్రను ఢిల్లీ గణేష్‌కు ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. సీరియస్ రోల్స్ చేసే ఆయనకు అంత కామెడీ రోల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, పైగా నెగెటివ్ ఫీలింగ్ వచ్చి సినిమాకు మైనస్ అవుతుందని భావించారు. కానీ కమల్‌హాసన్ ధైర్యం చేశారు. ‘ఆయన రంగస్థలం నుంచి వచ్చిన నటుడు. ఏ పాత్రైనా పోషించగలరు’ అని గట్టి నమ్మకంతో ఉన్నారు. తన పాత్ర కంటే ఢిల్లీ గణేష్‌ పాత్రకు ఎక్కువ డైలాగులు, కొత్త మేనరిజమ్స్ పెట్టి ఆ పాత్ర బాగా వచ్చేలా చేశారు. ఆ క్రెడిట్ అంతా కమల్‌హాసన్‌దేనని ఢిల్లీ గణేష్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ‘తెనాలి’ సినిమాలో కూడా పూర్తి నిడివి ఉన్న డాక్టర్ పంచభూతం పాత్రను ఆయన చేత చేయించారు. ఈ రెండు పాత్రలకూ తెలుగులో నటుడు ఏవీఎస్ డబ్బింగ్ చెప్పారు.

మొత్తం 400 సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేష్. అందులో పది మలయాళం, మూడు తెలుగు(జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు(2009)), మూడు హిందీ సినిమాలున్నాయి. సినిమాల్లో విశేషమైన పేరు వచ్చిన తర్వాత దాదాపు 30 తమిళ సీరియళ్లలో నటించారు. 2018లో ‘అమెరికా మాప్పిళ్లై’, 2021లో ‘నవరస’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటించారు. ఇటీవల విడుదలైన ‘ఇండియన్-2’ ఆయన చివరి సినిమా. ఏ కమల్‌హాసన్‌తో నటించడం ఆయనకు విశేషమైన పేరు తెచ్చిందో, ఆ కమల్‌హాసన్‌తో చేసిన చిత్రం ఆయన చివరి చిత్రం అయ్యింది.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2024 | 11:32 AM