Dandora: తెలంగాణ బతుకు సిత్రం.. నాగవంశీ డైరెక్షన్
ABN , Publish Date - Dec 11 , 2024 | 06:37 PM
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ వంటి నటులతో తెరకెక్కుతున్న తెలంగాణ బతుకు చిత్రం(సిత్రం) 'దండోరా'.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘కలర్ ఫోటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం రోజున ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది.
ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రలతో మెప్పించనున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్, రేఖ భోగవరపు కాస్ట్యూమ్ డిజైనర్, ఎడ్వర్డ్ స్టీవ్‌సన్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అనీష్ మరిశెట్టి కో ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.