CM Revanth Reddy: ఫైనల్‌గా సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన సూచనలివే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:24 PM

‘సంధ్య’ థియేటర్ ఘటన అనంతరం టాలీవుడ్‌కు, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కొందరు కలిశారు. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. అవేంటంటే..

CM Revanth Reddy Meeting

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో తాను ఏదయితే ప్రకటన చేశానో.. దానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ అభివృద్ధి, గద్దర్ అవార్డ్స్, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు సహా పలు అంశాలపై సీఎం, సినీ పెద్దల మధ్య చర్చలు నడిచాయి. బెనిఫిట్ షోలు ఉండవని సీఎం చెప్పడంతో కనీసం సంక్రాంతి సినిమాలకైనా అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా.. కుదరదని సీఎం తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనను సీఎం ప్రస్తావిస్తూ... శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే అని చెప్పారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, నాగార్జున సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలిస్తూ.. ‘‘సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వారి అనుమానాలు, అపోహలు, ఆలోచనలను మాతో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. ‘పుష్ప2’ సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు నిర్మాత దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.

Also Read-సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..


Dil-Raju-and-CM-Revanth-Red.jpg

తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు 24 గంటల్లో రావచ్చు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. టెంపుల్ టూరిజానికి సహకరించండి. ఇక మీదట ఆలయాల్లో షూటింగ్స్ చేసుకోండి. ప్రభుత్వం సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలి. టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి. ధరల పెంపునకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. సినిమా రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై మా విధానాన్ని ఇప్పటికే ప్రకటించాం. దానిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

Also Read-Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?


గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైనా అవగాహన కల్పించేలా సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినీ పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు ఉండాలి. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. పరిశ్రమను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చుకోలేకపోతోంది. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని చెప్పుకొచ్చారు.


Also Read-సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 03:24 PM