Jani Master: జానీ మాస్టర్ వైరల్ పోస్ట్.. అందరికీ థ్యాంక్స్
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:37 PM
బెయిల్‌పై రిలీజైన తర్వాత జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా తనని ట్రెండింగ్ లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే..
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్ (Choreographer jani Master) కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల క్రితం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయగా రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే రిలీజైన తర్వాత జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా తనని ట్రెండింగ్ లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే..
జానీ మాస్టర్.. కార్తీక్ ఆర్యన్ నటించిన హిందీ మూవీ భూల్ భులయ్యా 3కి కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఆ సినిమాలోని టైటిల్ ట్రాక్ హరే రామ్ హరే రామ్ ట్రెండ్ అవుతోంది. దీంతో జానీ మాస్టర్ ఆ పోస్ట్‌ని షేర్ చేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంచినందుకు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. కొందరు జానీ మాస్టర్‌కి మద్దతు తెలుపుతుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పది రోజుల క్రితం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ ఫొక్సో చట్ట కింద జానీ మాస్టర్ అరెస్టు అయిన నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఆవార్డును కమిటీ తాత్కాలికంగా నిలిపివేయడంతో తనకు వచ్చిన బెయుల్ను రద్దు చేసుకుని జానీ మాస్టర్ జైలుకు వెల్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయగా తెలంగాణ హైకోర్టు.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు.
అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురి చేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.