Ananya nagalla: ఓ పెద్దాయన వచ్చి అలా అన్నారు.. షాక్ అయ్యా
ABN , Publish Date - Mar 24 , 2024 | 11:42 AM
ఖమ్మం నుంచిఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ‘మల్లేశం’ ద్వారా టాలీవుడ్‌లోప్రవేశించిన నటి అనన్య నాగేళ్ల. నాలుగేళ్లలో ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులు తనను గుర్తించేలా చేసుకుంది
ఖమ్మం నుంచిఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ‘మల్లేశం’ ద్వారా టాలీవుడ్‌లోప్రవేశించిన నటి అనన్య నాగేళ్ల (Ananya nagalla). నాలుగేళ్లలో ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులు తనను గుర్తించేలా చేసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘తంత్ర’ (tantra)విడుదలయింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో గత నాలుగేళ్లలో తాను నేర్చుకున్న పాఠాలను ‘నవ్య’కు వివరించింది.
ఈ జర్నీ ఎలా ఉంది?
చాలా బావుంది. ఉత్సాహంగా, ఉత్సుకతతో ముందుకు వెళ్తున్నా. అదే సమయంలో భయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ నాలుగేళ్లలో జయపజయాల కన్నా నా జర్నీ ముఖ్యమని తెలుసుకున్నా. సినిమాలు ఎలా తీస్తారో తెలిసింది. ఈ క్రాఫ్ట్ వెనుక ఉన్న విషయాలు తెలుస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో కూడా తెలిసింది.
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే నటీనటులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటి?
సరైన రోల్‌ను పట్టుకోవటం చాలా ముఖ్యం. చాలా చోట్ల అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ‘మనం ఎంచుకొనేది సరైనదా? కాదా?’ అనే విషయాన్ని తెలుసుకోవటంలోనే సగం జీవితం అయిపోతుంది. అంతేకాదు, పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తూ కూర్చోకూడదు. మనకు దొరికిన పని చేయాలి. ఇండస్ట్రీలో ‘వర్క్ ఎట్రాక్ట్స్ వర్క్’ అనే సూత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇలా పనిచేస్తూ పోతే ఎక్కడో ఒక చోట సక్సెస్ లభిస్తుంది. ఈ విషయంలో ఎవరికైనా ఎటువంటి షార్ట్‌కట్స్ ఉండవు. ఈ జర్నీలో సంతోషాలు, దుఃఖాలు... ఇలా రకరకాల భావోద్వేగాలుంటాయి. వీటన్నింటినీ దాటుకొనే వెళ్లాలి. అయితే ఈ జర్నీ అందరికీ ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కళ్లకు ఒకో విధంగా ఉంటుంది.
మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?
మాది ఖమ్మం. మధ్యతరగతి కుటుంబం. బీటెక్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ ఉద్యోగం చేసేదాన్ని. షార్ట్‌ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసేదాన్ని. వాటిని చూసుకున్నప్పుడు- ‘నేను కూడా నటించగలను’ అనే ధైర్యం కలిగింది. దాంతో సినిమాల్లోకి వచ్చేశాను.. నాకు టాలీవుడ్ గురించి ఏమి తెలియదు. కేవలం సినిమాలను నమ్ముకొని వచ్చాను... అంతే!
మధ్యతరగతి కుటుంబం కదా... ఇంట్లో వాళ్లు ఏమీ అనలేదా?
నేను వాళ్లకు చెబితే కదా! ‘మల్లేశం’ సమయంలో నాకు వేరే చోట పని ఉందని చెప్పి వెళ్లేదాన్ని. కంపెనీకి సెలవు పెట్టేదాన్ని. ఇలా కొద్ది కాలం గడిచింది. సినిమా వచ్చిన తర్వాత అమ్మానాన్నలకు తెలిసింది. వాళ్లు విపరీతంగా కోప్పడ్డారు. ఆ సినిమా ఆడటంతో వాళ్లకు కూడా కొంత నమ్మకం కలిగింది.
సినిమా ప్రపంచంలో స్థిరత్వం ఉండదు. దీన్ని ఎలా తట్టుకుంటారు?
అవును. చదువు, స్థిరమైన ఉద్యోగం గురించి ఆలోచించే ప్రపంచం నుంచి వచ్చినదాన్ని నేను. చదువుకొనేదాన్ని. ఉద్యోగం చేసేదాన్ని. ఇంట్లో పని... ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. కానీ సినిమాల్లో అలా కుదరదు. కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొన్నిసార్లు అస్సలు పనిలేకుండా నిరాశగా ఉంటుంది. ఈ సమయంలో అనేక అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి. ఉదాహరణకు ‘వకీల్‌సాబ్’ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ‘నేను ఉద్యోగం మానేసి రావటం సరైన పనేనా’ అనే అనుమానం కలిగింది.
వీటి నుంచి ఎలా బయటపడ్డారు?
సినిమా తీసే ప్రక్రియ అర్థమయితే ఈ అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇదంతా ఒక జర్నీలో భాగమని అర్థమవుతుంది. నేను ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటా. నా ఉద్దేశంలో- మనకు శక్తిని ఇచ్చేవి ఆలోచనలే! ఎంత బలహీనంగా ఉన్నా- ఒక పాజిటివ్ ఆలోచన వస్తే చాలు- బలం దానంతట అదే వస్తుంది. ఇది అంత సులభం కాదు. కానీ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తా! ఏడుపు మరో స్ట్రెస్ బస్టర్. ఒక్కసారి ఏడిస్తే- మనసు తేలికపడుతుంది. పాజిటివిటీ వచ్చేస్తుంది.
మీకు ఇప్పటి దాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?
‘మల్లేశం’ ప్రీమియర్ తర్వాత ఒకాయన వచ్చి ‘‘నువ్వు ఇంట్లో అమ్మాయిలా ఉన్నావు. సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చావనుకోలేదు’’ అన్నారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్!
మీరు పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చారు. ముంబయి హీరోయిన్లు, కాన్వెంట్లలో చదువుకొని వచ్చిన వారిని చూస్తే మొదట్లో ఎలా అనిపించేది?
మొదట్లో కొంత అభద్రతా భావం ఉండేది. ‘నేను అందంగా లేనా? ఈ ఇండస్ట్రీకి సరిపోనా?’ అనిపించేది. కానీ తర్వాత ఆ ఆలోచనలు తగ్గిపోయాయి. దానికి కారణం నేను చేసిన పాత్రలు కావచ్చు. కాలేజీలో ఉన్నప్పుడు- నేనే పెద్ద షోకిల్లానని అనుకొనేదాన్ని. ఇక్కడకు వచ్చిన తర్వాత అందంగా లేనా? అనే ఫీలింగ్ ఉండేది. కానీ దక్షిణాది పాత్రలకు- ఇక్కడ అమ్మాయిలే బావుంటారని, వారినే ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమయింది. దాంతో ఇప్పుడు నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు.
ఒక అమ్మాయిగా చెబుతున్నా! అమ్మాయిల జీవితాలను ప్రతిబింబించే సినిమాలు వస్తే బావుంటుంది. చాలా సినిమాల్లో అమ్మాయిలు వస్తారు. హీరోలను ప్రేమిస్తారు. వారి జీవితంలో ఒక భాగమయిపోతారు. అంతకన్నా వారికి పెద్ద అస్థిత్వం ఉండదు. అమ్మాయిలకు కూడా ఒక జీవితం... వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయనే విషయం చెప్పే కథలు బావుంటాయి’’
నా ఉద్దేశంలో నటన అందరికీ వస్తుంది. కానీ నటించటానికి కొంత తర్ఫీదు అవసరం. సమయం కూడా వెచ్చించాలి. ఆసక్తి కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటే ఎవరైనా నటించవచ్చు.
నా ఫేవరెట్ హీరోయిన్ ఆలియా భట్. సమంతా. వీరిద్దరి జర్నీ నాకు నచ్చుతుంది. ఇద్దరు కష్టపడి పైకి వచ్చినవాళ్లే!