Chiranjeevi: రచ్చ గెలిచాను..  ఇప్పుడు ఇంట గెలిచాను..

ABN , Publish Date - Oct 29 , 2024 | 01:06 PM

17 ఏళ్ల క్రితం తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలో జరిగిన గాయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటికీ మరచిపోలేదు. ఆ వేదికగా మోహన్‌ బాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరిచిపోయిన వివాదాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చారు.

17 ఏళ్ల క్రితం తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలో (Telugu cinema Vajrotsavam) జరిగిన గాయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికీ మరచిపోలేదు. ఆ వేదికగా మోహన్‌ బాబు (Mohanbabu) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరిచిపోయిన వివాదాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చారు. సోమవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఎఎన్నార్‌ జాతీయ అవార్డుల వేడుకలో  మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ "తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి ఒకటుంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. సినిమా పరిశ్రమలో మొదట రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అన్నాను. (ANR National Award)

అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్‌ ఏఎన్నార్‌ అవార్డును ది గ్రేట్‌ అమితాబ్‌ బచ్చన్‌ గారి చేతుల మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది.. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచానని. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌లో స్థానం ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. ఇదే మాట స్టేజీ మీద చెప్పాలనుకున్నా,. చెప్పాను’’ అని అన్నారు. అయితే చిరంజీవి ఉద్దేశం ఏదైనా.. 17 ఏళ్ల క్రితం వజ్రోత్సవ వేడుకల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ జనరేషన్‌కు అప్పటి వివాదంపై పెద్దగా అవగాహన లేకపోవటంతో వజ్రోత్సవంలో చిరంజీవి మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శల వీడియోను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. 

Updated Date - Oct 29 , 2024 | 01:08 PM