Biggboss 8: బిగ్‌బాస్ -2 ఫినాలే.. భద్రత కట్టుదిట్టం..
ABN , Publish Date - Dec 12 , 2024 | 08:51 AM
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగింపునకు సిద్దమైంది. ఈ నెల 15న గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీని కోసం తెలంగాణ పోలీసులు (TG police) భద్రతను కట్టుదిట్టం (Security) చేస్తున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 (biggboss8) ముగింపునకు సిద్దమైంది. ఈ నెల 15న గ్రాండ్ ఫినాలే (Grand Finale) జరగనుంది. దీని కోసం తెలంగాణ పోలీసులు (TG police) భద్రతను కట్టుదిట్టం (Security) చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-5లోని అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios) ఏడెకరాల్లో బిగ్‌బాస్ సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు .ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం, తదితర అనుభవాలు ఎదురయ్యాయి. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సు అద్దాలు పగులగొట్టారు. అప్పటి బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు బిగ్‌బాస్, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది.
ఆ దాడికి పాల్పడిన వారిని గుర్తించడం పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇక్కడ సీసీ కెమెరాలు లేక పోవడంతో చాలామంది తప్పించుకున్నారు. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్‌బాస్ షో జరిగే స్టూడడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటుచేయాలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ పాయింట్‌లను బిగ్‌బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. ఇటీవల యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్‌లో జరిగిన పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్వాహకులు 60 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో 15 ఫోన్లు, రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. చోరులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ సీజన్ - 8 ఫైనల్ సందర్భంగా స్టూడియో చుట్టూ 53 కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు.