Sai Rajesh: అభిమాని ఆతిధ్యం షాకిచ్చింది.. అలా అనేసరికి
ABN , Publish Date - Jul 06 , 2024 | 10:06 AM
'బేబి’ (Baby) సినిమాతో సంచలన విజయం అందుకున్నారు దర్శకనిర్మాత సాయిరాజేష్ (Sai rajesh). గతంలో పలు చిత్రాలకు దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఆయన ‘బేబి’తో పాపులర్ అయ్యారు.
'బేబి’ (Baby) సినిమాతో సంచలన విజయం అందుకున్నారు దర్శకనిర్మాత సాయిరాజేష్ (Sai rajesh). గతంలో పలు చిత్రాలకు దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఆయన ‘బేబి’తో పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన ఇన్స్టా గ్రామ్‌లో ఫన్నీ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఓ స్నేహితుడు అభిమాని అయిన వ్యక్తి ఇంటికి భోజనానికి పిలిచి షాకిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. ‘నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, ‘నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహంలో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు’ అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలతో మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం, ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, ‘బేబీ సినిమా డైరెక్టర్’ అని 30 ఫోటోలు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్‌లో గారెలు, నాటుకోడి పులసు వడ్డించారు. ‘మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో’ అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్లిపోయినాయి. ఓ బేబీ’ అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.
అయితే ఆ అతిథ్యం ఇచ్చిన వారు సాయి రాజేష్ తీసింది 'ఓ బేబీ’ సినిమా అనుకున్నారు. కానీ ఆయన తీసింది 'బేబీ' సినిమా. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ స్నేహితుడికి, స్నేహితుడు సాయి రాజేశ్‌కి పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. తన పోస్ట్‌కు ఓ బేబీ దర్శకురాలు నందినీరెడ్డి కూడా కామెంట్ చేశారు.