Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. మెగాస్టార్ కోటి విరాళం
ABN , Publish Date - Sep 04 , 2024 | 10:24 AM
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోమారు తన సహృదయాన్ని చాటారు. రెండు రాష్ట్రాలకు రూ.కోటి సాయాన్ని ప్రకటించారు.
దేశంలో ఎప్పుడు, ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. గత నెలలో కేరళ వాయనాడ్ వరదల నేపథ్యంలో మొదటగా స్పందించి సాయం అందించింది టాలీవుడ్ మాత్రమే. అలాంటిది ఇప్పుడు మన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), పవన్ కల్యాణ్, బాలకృష్ణ, విశ్ంక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కథానాయిక అనన్య నాగళ్ల, యాంకర్ స్రవంతి, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, వంశీ, ఆయ్ మూవీ టీం తమవంతు సాయంగా ప్రకటించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి భారీ విరాళం ప్రకటించారు. గత నెలలో వయనాడ్ వరదల నేపథ్యంలోనూ చిరంజీవి ఆ రాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ. కోటి ఇవ్వడం విశేషం.
ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయాశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటూ తన సానుభూతిని తెలియజేశారు.
ఇప్పటి వరకు.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్- ఏపీకి రూ. కోటి
మెగాస్టార్ చిరంజీవి ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు
త్రివిక్రమ్ - రాధాకృష్ణ - నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు