Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. కానీ ఇంటికి వెళ్లలేదు
ABN , Publish Date - Dec 14 , 2024 | 07:56 AM
చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళతాడని అంతా భావించారు కానీ.. అక్కడే ఆయన ట్విస్ట్ ఇచ్చారు. జైలు నుండి అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లారంటే..
చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్‌ను శనివారం ఉదయం 6-30 గంటల తర్వాత విడుదల చేశారు. మెయిన్ గేటు నుంచి కాకుండా.. ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి అల్లు అర్జున్‌ను మీడియా కంట పడకుండా పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అభిమానులను అనుమతించకుండా.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే దారిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ నేరుగా ఇంటికి కాకుండా.. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో మామయ్య చంద్రశేఖర్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అనంతరం మామయ్య ఇంట్లో ఉన్న తన భార్య, పిల్లలను తీసుకుని వచ్చేందుకు వెళ్లనున్నారు. మామయ్య ఇంటి నుండి భార్య, పిల్లలతో అల్లు అర్జున్ తన జూబ్లీహిల్స్ నివాసానికి ఉదయం 8 గంటలకు రానున్నారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ వస్తారని తెలిసి అభిమానులు గుమిగూడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్ విడుదల.. కాసేపట్లో ఇంటికి
తన సినిమా ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్‌కు స్వయంగా వెళ్లి.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ నెల 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్‌పై శనివారం అల్లు అర్జున్ విడుదలయ్యారు.