Allu Arjun: అల్లు అర్జున్ విడుదల.. కాసేపట్లో ఇంటికి

ABN , Publish Date - Dec 14 , 2024 | 07:12 AM

‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చినా.. శుక్రవారం విడుదల కాలేదు. శనివారం ఉదయం ఆయనని జైలు నుండి విడుదల చేశారు.

అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుండి శనివారం ఉదయం విడుదలయ్యారు. తన సినిమా ప్రీమియర్‌ షో చూసేందుకు థియేటర్‌కు స్వయంగా వెళ్లి.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా.. ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్‌ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్వర్వులు అప్‌లోడ్‌ చేసేసరికి రాత్రి 10.30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు. దీంతో రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన బెయిల్ పత్రాలు సమర్పించడంతో.. శుక్రవారం ఉదయం ఆయనని విడుదల చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు.

మెయిన్ గేటు నుంచి కాకుండా.. ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి అల్లు అర్జున్‌ను మీడియా కంట పడకుండా పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అభిమానులను అనుమతించకుండా.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే దారిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్‌ అరెస్టు దగ్గర్నుంచి రాత్రి విడుదల వాయిదా పడేదాకా రోజంతా హైడ్రామా నడిచింది. ఆయన అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌కు సంఘీభావం ప్రకటించగా.. అరెస్టును ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీతోపాటు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్ది మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.


allu-arjun.jpg

అసలు జరిగింది ఇదే..

తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ నెల 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్‌ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్‌ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై 105 (హత్య కిందకు రాని ప్రాణ నష్టం ), 118(1) (ప్రమాదకరంగా వ్యవహరించడం, వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం) రెడ్‌విత్‌ 3(5), నాన్‌న్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఏ11గా చేర్చారు. అల్లు అర్జున్‌ నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా, బయట క్రిస్టల్‌ హోటల్‌ నుంచి ఓపెన్‌ టాప్‌ కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా వందలాది అభిమానులు ఆయనవైపు చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెంది, ఆయన కొడుకు తీవ్ర గాయాలపాలయ్యారని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇటీవల థియేటర్‌ భాగస్వామి ఎం.సందీప్‌, మేనేజర్‌ నాగరాజు, బాల్కనీ ఇన్‌చార్జి విజయ్‌ చందర్‌లను అరెస్టు చేశారు. కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ శుక్రవారం ఇంట్లోనే ఉన్నట్లు తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు 11:30కు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్‌ సైతం పోలీసుల కారులోనే మధ్యాహ్నం 12:30కు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనను పీఎస్‌కు తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పీఎస్‌ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కొన్ని నాటకీయ పరిణామాలు చోటుకున్న అనంతరం రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వచ్చింది.

Updated Date - Dec 14 , 2024 | 07:12 AM