Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Dec 21 , 2024 | 06:55 PM

తెలంగాణ అసెంబ్లీలో శనివారం సంధ్య థియేటర్ ఘటనపై హాట్ హాట్‌గా చర్చలు నడిచిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. అల్లు అర్జున్ ఈ సమావేశంలో ఏం చెప్పారంటే..

Allu Arjun Press Meet

శనివారం తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హాట్ హాట్‌గా చర్చలు నడిచాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనలో అసలు ఏం జరిగిందనేది.. అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. అంతేకాదు, సంధ్య థియేటర్ వద్ద అంత పెద్ద ఘటన జరిగి, ఓ తల్లి చనిపోయి, ఆ తల్లి కొడుకు హాస్పిటల్ ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా పరామర్శకు రాలేదు. అల్లు అర్జున్ జైలు నుండి విడుదలగానే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంట్లో వాలిపోయింది అంటూ సినిమా వాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు తీసుకుని వారి వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రేక్షకుల, అభిమానుల ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం సహించం అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ..


ఇది ఆకస్మాత్తుగా జరిగిన ప్రమాదం. ఇది ఎవరి తప్పు కాదు. మంచి ఇంటెన్షన్‌తో చేసినా కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇది ఎవరి కంట్రోల్‌లో లేదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాను. బాధితుడు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది. థియేటర్ అంటే నాకు దేవాలయం వంటిది. అలాంటి థియేటర్‌లో యాక్సిడెంట్ జరిగిందంటే.. నాకంటే బాధపడేవారు ఎవరైనా ఉంటారా? శ్రీతేజ్ గురించి గంటగంటకు వాకబు చేస్తూనే ఉన్నాను. అతను కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించాను. సంధ్య థియేటర్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం.

మిస్ కమ్యూనికేషన్ వల్ల అనర్థం జరిగింది. ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం పెట్టుకోవాలని అనుకోవడం లేదు. తెలుగువారి ఖ్యాతిని పెంచేందుకు సినిమాలు చేస్తున్నాను. తెలుగువారి పరువు నిలబెట్టేందుకు నేను సినిమాలు చేస్తుంటే.. నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం జరుగుతుంది. కొందరి వ్యాఖ్యలు నన్ను ఎంతగానో బాధించాయి.

ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్.. నేను ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. దయచేసి అంతా అర్థం చేసుకోండి. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఇది జరిగింది. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏ పొలిటికల్ లీడర్‌ని, పోలీసు వారిని, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం లేదు. ప్రభుత్వం విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు థియేటర్లలో స్పెషల్ ప్రైస్ ఇచ్చారు. ఆ విషయంలో మేమంతా హ్యాపీగానే ఉన్నాం. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు. నేను ఇలా చేశాను.. నేను ఇలా అన్నాను.. అని తప్పుడు ఆరోపణలు నాపై పడేసరికి అవమానంగా అనిపించింది. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారనిపించింది. దాదాపు 20 ఏళ్లుగా ఉన్నాను.. నేను ఎప్పుడైనా ఇలా చేశానా? అలా అంటానా? అలా మాట్లాడగలనా? నేనేం చేయకుండా.. నన్ను అంటుంటే చాలా బాధేస్తుంది.


సినిమా పెద్ద సక్సెస్ అయింది. అయినా కూడా ఆ సక్సెస్ మొత్తం పక్కన పెట్టేసి, గత 15 రోజులుగా అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టేసి, పబ్లిక్ ఫంక్షన్స్ పెడదామనుకుని కూడా అన్నింటినీ క్యాన్సిల్ చేసేసి.. ఒక్కడినే కూర్చుని బాధపడుతున్నా. అసలు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నా. 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా.. థియేటర్‌లో ఎలా ఉందో కూడా ఇంత వరకు చూడలేదు నేను. నేను ప్రతి సినిమా థియేటర్‌లో చూస్తా. అది నాకు పాఠం నేర్పుతుంది. రాబోయే సినిమా ఎలా తీయాలి? అనేది నేను అక్కడ నేర్చుకుంటా. అయినా సరే.. నా తప్పు లేకపోయినా.. నేనున్న ప్రదేశంలో ఘటన జరిగింది కాబట్టి.. అందుకు నేను క్షమాపణలు చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు 15 రోజుల తర్వాత, మీరు అలా అన్నారట.. ఇలా అన్నారట. కాళ్లు, చేతులు విరిగినా పర్లేదు అని అన్నానని.. నా క్యారెక్టర్‌ని హననం చేస్తుంటే చాలా బాధేస్తుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచాలని నేను కష్టపడుతుంటే.. నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా? నేను ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేందుకే ఈ సమావేశం.

తొక్కిసలాట గురించి తెలిసి కూడా నేను సినిమా చూశానని తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట గురించి నాకు మరుసటి రోజే తెలిసింది. ఘటన జరిగిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకున్నాను. కానీ అక్కడకు రావద్దని పోలీసులు నాకు సూచించారు. పోలీసుల అనుమతితోనే థియేటర్‌కి వెళ్లానని, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే.. లీగల్ ఇష్యూస్ వస్తాయని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 09:20 PM