Allu Arjun: బన్నీని అరెస్ట్ చేసింది ఫ్యానే.. షెకావత్ కాదు బానోత్
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:05 PM
శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజైన విషయం తెలిసిందే. ఇంతకీ బన్నీని అరెస్ట్ చేసింది ఆయన ఫ్యానే అని మీకు తెలుసా..
పుష్ప-2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ షెకావత్ నుంచి తప్పించుకునేందుకు పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అతన్ని ముప్పుతిప్పలు పెడతాడు. పుష్పరాజ్ చేస్తున్న ఎర్రచంద్రనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి షెకావత్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. అయితే అనేక రకాల ఉపాయాలతో పుష్ప తప్పించుకుంటూ ప్రేక్షకులను అబ్బురపడుస్తాడు. ఇది కేవలం రీల్ లైఫ్‌కు మాత్రమే పరిమితం, కానీ రియల్ లైఫ్ కథ మరోలా ఉంది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గురువారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు పుష్ప(అల్లు అర్జున్)ను అరెస్టు చేసిన పోలీసు అధికారి గురించి తెగ చర్చ నడుస్తోంది. ఎవరూ అరెస్టు చేశారంటూ నెటిజన్లు తెగ గూగుల్ చేస్తున్నారు. అతని గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్టు చేసింది సీఐ బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే బన్నికి సీఐ పెద్ద అభిమాని. జీవితంలో ఒక్కసారైనా అభిమాన హీరో బన్నిని చూడాలని కోరుకునేవారట రాజు నాయక్. అయితే ఏకంగా అతన్నే అరెస్టు చేస్తానని ఏమాత్రం ఊహించలేకపోయానని సీఐ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అభిమాన నటుడిని చూశాననే ఆనందం ఓ పక్క, తన చేతులతోనే అతన్ని అరెస్టు చేశానని సీఐ బాధపడినట్లు తెలుస్తోంది. కానీ విధి నిర్వహణలో భాగంగా తన పని తాను చేసినట్లు సీఐ బానోత్ నాయక్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవడం ఎవ్వరికైనా చాలా వింతంగా అనిపిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
మరోవైపు జైలు నుండి మధ్యంతర బెయిల్‌తో విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. హీరోలు, దర్శకనిర్మాతలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర సందడి వాతావారణం నెలకొంది.