అగ్రనటుల అభిమానుల క్రికెట్ ఆట, అభిమానుల ప్రవర్తనకి ఫిదా అయిన కొండా
ABN , Publish Date - Feb 06 , 2024 | 05:57 PM
అగ్ర నటుల అభిమానులు తమ నటుల పేరు మీద క్రికెట్ టీములను ఏర్పాటు చేసి, క్రికెట్ గ్రౌండ్ లో తమ ప్రతాపం చూపించినా, ఆట ముగిసిన తరువాత అందరి నటుల అభిమానులందరూ చెట్టాపట్టాలేసుకొని తిరగటం ఒక అందమైన అనుభూతి
హైదరాబాదు నగరంలో అగ్ర నటుల పేరుమీద ఆ నటుల అభిమానులు క్రికెట్ మ్యాచ్ లు ఆడారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, నితిన్, రవితేజ అభిమానులు వారి వారి అభిమాన నటులకు అనుగుణంగా తమ టీము పేర్లని పెట్టుకున్నారు. ఉదాహరణకి చిరంజీవి టీము పేరు జై చిరంజీవ టీము అని, బాలకృష్ణ టీము ఎన్.బి.కె లయన్స్, మహేష్ బాబు టీము పేరు గ్లోబ్ ట్రోట్టర్స్, రవితేజ టీముకి టీము ఈగల్ అని, ఇలా అన్ని టీములకి పేర్లు పెట్టుకున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల టీం పేరు హంగ్రీ చీతాస్ అని, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల టీము రోరింగ్ రెబెల్స్ అని పెట్టారు. ఈ రెండు టీములు ఫైనల్ కి వచ్చాయి, ఫైనల్ లో ప్రభాస్ టీము, పవన్ కళ్యాణ్ టీము పై ఘన విజయం సాధించింది. (Rebel Star Prabhas fans team Roaring Rebels won the finals beat Pawan Kalyan's Hungry Cheethas by 6 wickets) ఈ క్రికెట్ మ్యాచులు అన్నీ ఎఎం క్రికెట్ గ్రౌండ్, అజిజ్ నగర్, మొయినాబాద్ లో ఆర్గనైజ్ చేశారు సందీప్ ధనపాల. (TFI Fans Cricket)
సందీప్ కి చిత్ర పరిశ్రమలో కొంతమంది నటులతో వున్న దగ్గరి అనుబంధం వలన ఈ మ్యాచ్ లను కొంతమంది మితృలతో కలిసి ఆర్గనైజ్ చేశారని తెలిసింది. కొన్ని మ్యాచ్ లకు ఇప్పుడు విడుదలైన, విడుదలవుతున్న చిత్రాలలో నటించిన నటీనటులను కూడా ఈ మ్యాచ్ లకు ఆహ్వానించినట్టుగా చెపుతున్నారు సందీప్. 'ఊరు పేరు భైరవకోన', 'భూతద్దం భాస్కర్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' 'పొట్టేలు' ఇలా కొంతమంది నటీనటులు ఆ చిత్రాలకు ప్రచారంగా కూడా ఉపయోగేపడే విధంగా ఆహ్వానించారు.
సామజిక మాధ్యమాల్లో అగ్ర నటుల అభిమానులు ఎక్కువగా ఒకరిమీద ఒకరు చాలా దూషణలు చేసుకుంటూ వుంటారు, కించపరుస్తూ మాట్లాడుతారు, అలాంటి వైషమ్యాలు తగ్గించడానికి ఈ 'తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫాన్స్ అసోసియేషన్ లీగ్' అనే క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడంలో వున్న ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పారు సందీప్.
క్రికెట్ గ్రౌండ్ లో టీముల మధ్య పోటీ ఉంటుంది కానీ, మ్యాచ్ అయ్యాక అందరూ ఒకటే అన్నట్టుగా అభిమానులు అందరూ ఉండటం చూసి మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి 'ఎక్స్' లో ఈ అభిమానుల క్రికెట్ మ్యాచ్ గురించి పోస్ట్ చేశారు. కొండా విశ్వేశ్వర రెడ్డి ని ప్రత్యేక అతిధిగా ఫైనల్ మ్యాచ్ కి పిలిచారు.
జనవరి 29న ఈ లీగ్ మొదలైందని, మొత్తం 12 జట్లు పోటీపడ్డాయని, అందులో క్వార్టర్ ఫైనల్స్ కి ఎనిమిది జట్లు చేరాయని, సెమీఫైనల్స్, ఫైనల్స్ అలా ఈ టోర్నమెంట్ ముగిసిందని తెలిపారు. ఇలా అగ్ర నటుల అభిమానులతో ఇలాంటి టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి అని, ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని అనుకుంటున్నట్టు సందీప్ చెప్పారు. ఈ మ్యాచ్ లు అన్నీ యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రచారం కూడా చేశామని, లక్షమందికి పైగా ఈ ప్రసారాన్ని తిలకించారని చెప్పారు సందీప్.