ANR@100: గ్లాసు పట్టుకుంటే దేవదాసు.. కలం పట్టుకుంటే కాళిదాసు
ABN , Publish Date - Sep 20 , 2024 | 09:33 AM
ఒకటి కాదు రెండు కాదు.. 255కు పైగా పాత్రలకు ప్రాణం పోశారు అక్కినేని నాగేశ్వరరావు. సినీ జీవితంలో తీరికలేని జీవితం గడిపిన ఘనత ఆయనది.
పంచె కడితే.. పల్లెటూరి పూల రంగడు
ప్రేమను పంచడంలో లైలాకు మజ్ను
గ్లాసు పట్టుకుంటే దేవదాసు,
కలం పట్టుకుంటే కాళిదాసు
నటనా రంగంలో అలుపెరగని బాటసారి
వైద్యానికి డా. చక్రవర్తి
మాయాబజార్‌కు అభిమన్యుడు,
ఆ తరం నాయికలకు దసరాబుల్లోడు
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 255కు పైగా పాత్రలకు ప్రాణం పోశారు అక్కినేని నాగేశ్వరరావు(ANR). సినీ జీవితంలో తీరికలేని జీవితం గడిపిన ఘనత ఆయనది. చివరి క్షణం వరకూ కూడా తను ఎంచుకున్న వృత్తికి న్యాయం చేస్తూనే ఉన్నారు. నేడు ఏయన్నార్ 100వ జయంతి. తెలుగుతెరపై తనదైన ముద్ర వేసిన ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుందాం. (ANR centenary celebrations)
నిలువెత్తు తెలుగుదనం (Akkinneni Nageswararao)
పంచెకట్టు, లాల్చీ, మెడలో శాలువా... తెలుగుదనానికి నిలువెత్తు రూపం అక్కినేని. సినిమాలో రకరకాల రంగురంగుల దుస్తులు ఆయన ధరించినా బయట మాత్రం పంచెకట్టుతోనే కనిపించేవారు. జరీ అంచు పంచెకట్టుతో ఆయన చకచకా అడుగులు వేస్తూ నడుస్తుంటే అలాగే చూస్తుండిపోవాలనిపించేది. పొందూరు ఖాదీ పంచెలు ఆయన వాడేవారు. సొంతంగా డి జైన్ చేయించుకుని పొందూరు చేనేత కార్మికులతో ప్రత్యేకంగా నేయించుకున్న జరీ ఖాదీ పంచెలనే ఆయన ఉపయోగించేవారు. పల్లెటూరిలో పుట్టి పెరిగిన అక్కినేని పట్నవాసం చేసినా పల్లెటూరి పద్ధతులు, అలవాట్లు మరిచిపోలేదు. తన ప్రవర్తనతోనే కాకుండా డ్రస్‌కోడ్‌తో కూడా కోట్లాదిమంది అభిమానుల్ని ఆకట్టుకొన్నారాయన. అక్కినేని చూడగానే మన బాబాయినో, తాతయ్యనో చూస్తున్నట్లు, ఆత్మీయంగా మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆయన మాటతీరు కూడా అలాగే ఉండేది.
నిర్మాణరంగంలోనూ రాణింపు
నటునిగా శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు అంతటితో తన ప్రస్థానాన్ని ఆపలేదు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా చిత్రసీమకు సేవలందించారు. ఆయన నిర్మించిన చిత్రాలను పరికిస్తే ఆయనలోని ఉత్తమాభిరుచి, మానవీయ కోణం కనిపిస్తాయి. అలనాటి సుప్రసిద్ధ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుతో కలిపి నెలకొల్పిన అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఆణిముత్యాల్లాంటి చిత్రాలు తయారయ్యాయి. ఆ సంస్థకు ఛైర్మన్ నాగేశ్వరరావు కాగా, మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదనరావు. ఈ బేనర్‌పై వచ్చిన మొదటి చిత్రం ‘దొంగరాముడు’ (1955). అక్కినేని, సావిత్రి జంటగా కె.వి. రెడ్డి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయి అన్నపూర్ణ పిక్చర్స్ ఆగమనాన్ని ఘనంగా చాటింది. ఆ తర్వాత కాలంలో ఈ బేనర్‌పై ‘తోడి కోడళ్లు’ (1957), ‘మాంగల్య బలం’ (’59), ‘వెలుగు నీడలు’ (’61), ‘ఇద్దరు మిత్రులు’ (’61), ‘చదువుకున్న అమ్మాయిలు’ (’63), ‘డాక్టర్ చక్రవర్తి’ (’64), ‘ఆత్మ గౌరవం’ (’66), ‘పూల రంగడు’ (’67), ‘ఆత్మీయులు’ (’69), ‘జై జవాన్’ (’70), ‘అమాయకురాలు’ (’71), ‘విచిత్ర బంధం’ (’72), ‘బంగారు కలలు’ (’74) వంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. వీటన్నింటిలో నాగేశ్వరరావుకు నిర్మాణ భాగస్వామ్యం ఉంది. అలాగే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై ‘సుడిగుండాలు’ (1968), ‘మరో ప్రపంచం’ (1970) చిత్రాలు నిర్మించారు అక్కినేని.
దుక్కిపాటితోనూ, ఆదుర్తితోనూ భాగస్వామిగా చిత్రాలు నిర్మించాక హైదరాబాద్‌లో భార్య పేరిట అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించిన ఏఎన్నార్ అదే బేనర్‌పై వరుసగా చిత్రాలు తీశారు.
ఈ బేనర్‌పై నిర్మాణమైన తొలి చిత్రం ‘కల్యాణి’ (1979). దీనికి దర్శకుడు దాసరి నారాయణరావు. అనంతర కాలంలో ‘బుచ్చిబాబు’, ‘పిల్ల జమీందార్’ (’80), ‘ప్రేమాభిషేకం’, ‘ప్రేమ కానుక’ (’81), ‘శ్రీరంగ నీతులు’, ‘యువరాజు’ (’82), ‘విక్రమ్’ (’86), ‘అగ్ని పుత్రుడు’ (’87), ‘విజయ్’, ‘శివ’ (హిందీ), ‘శివ’ (’89), ‘ఇద్దరూ ఇద్దరే’ (’90), ‘రక్షణ’ (’93), ‘సిసింద్రి’ (’95), ‘నిన్నే పెళ్లాడతా’ (’96), ‘ఆహా’, ‘చంద్రలేఖ’, ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ (’98), ‘సీతారామరాజు’, ‘ప్రేమకథ’ (’99), ‘యువకుడు’ (2000), ‘మన్మథుడు’ (’02), ‘సత్యం’ (’03), ‘మాస్’ (’04), ‘సూపర్’ (’05), ‘పౌరుడు’ (’08), ‘రాజన్న’ (’11), ‘భాయ్’, ‘ఉయ్యాల జంపాల’ (’03) చిత్రాలు ఈ బేనర్ నుంచి వచ్చాయి. అలాగే ఏ.ఎన్.ఆర్. ఆర్ట్స్ బేనర్‌పై ‘తీర్పు’ (1994) అనే చిత్రాన్నీ నిర్మించారు అక్కినేని.