Thrigun: అమీ జాక్సన్ భర్త గుర్తింపును.. బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా
ABN , Publish Date - Oct 08 , 2024 | 10:29 AM
అమీ జాక్సన్ భర్త గుర్తింపును బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని నటుడు త్రిగుణ్ అన్నారు. కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘సీటీ నాటీ క్రేజీ’. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది.
తెలుగు నటుడు త్రిగుణ్ (Thrigun) కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘సీటీ నాటీ క్రేజీ’. మూడు కోణాల్లో సాగే హాస్యభరిత ప్రేమ కథా చిత్రంగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. హీరోయిన్లుగా శ్రీజిత ఘోష్, ఇనియ, రాధ నటించారు. హాస్య నటుడు అలీతో పాటు రవి మారియా, తంబి రామయ్య, సత్యన్, శామ్స్, మదన్‌బాబు విజయ్ టీవీ ధనశేఖర్, రఘుబాబు తదితరులు నటించారు.
పలు హిట్ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన జి.రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అరుణ్ విజువల్స్ అనే నూతన నిర్మాణ సంస్థపై వీఎంఆర్ రమేష్, ఆర్.అరుణ్ కలిసి నిర్మించారు. హైదరాబాద్, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా, ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ చెన్నైలో చేస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ (Thrigun) మాట్లాడుతూ.. ‘రెండు భాషల్లో తెరకెక్కిస్తుండటంతో రెండు భాషలకు అనువుగా ఉండేలా ఈ సినిమా టైటిల్ ఆంగ్లంలో పెట్టాం. తమిళ చిత్రపరిశ్రమలో అమీ జాక్సన్ భర్తగా నటించిన తొలి నటుడు అని నాకున్న గుర్తింపును బ్రేక్ చేసి, సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాను. మా సొంతూరు కోయంబత్తూరు. పెరిగిందంతా ఆంధ్ర. కష్టపడేతత్వం, నిజాయితీతో పనిచేస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవవచ్చు. కెరీర్ ఆరంభంలో సుమారు ముప్పైకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను’ అని పేర్కొన్నారు. హీరోయిన్ ఇనియ మాట్లాడుతూ, ‘సినిమాల్లో నిలదొక్కుకునేందుకు, మంచి నటిగా గుర్తింపు పొందాలంటే అన్ని రకాల పాత్రల్లో నటించాలి’ అని పేర్కొన్నారు.