Tammareddy Bharadwaja: తప్పు చేశానని ప్రూవ్ చేస్తే దేనికైనా రెడీ..

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:37 PM

చిత్రపురి కాలనీ కమిటీ పైన సైబరాబాద్ ఏకనామిక్ అఫెన్స్ వింగ్ నేతృత్వంలో సైబరాబాద్ డీసీపీ మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. చిత్రపురి కాలనీ కమిటిలోని మొత్తం 21 మంది పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ 120B నమోదు కాగా..‌ ఇందులో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేరు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది.‌ ఈ విషయంపై తాజాగా తమ్మారెడ్డి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.

Producer Tammareddy Bharadwaja

చిత్రపురి కాలనీ కమిటీ పైన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ నేతృత్వంలో సైబరాబాద్ డీసీపీ మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. చిత్రపురి కాలనీ కమిటిలోని మొత్తం 21 మంది పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ 120B నమోదు కాగా..‌ ఇందులో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) పేరు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది.‌ తాజాగా దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇంతవరకు చిత్రపురి కాలనీ వివాదం (Chitrapuri Colony Controversy) పై తనను ఎవరు సంప్రదించలేదని, పదేళ్ళ క్రితమే తాను ఆ కమిటీ నుంచి తప్పుకున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక నాలుగైదు నెలలుగా దీనిపై ఏదో జరుగుతుంది. ఇందుకు ముందు 51 ఎంక్వైరీ, 61 ఎంక్వైరీ అని రెండు ఎంక్వైరీలు వచ్చాయి. అందులో కూడా నా పేరు ఉంది. ఆ తర్వాత పోలీస్ కేసు అని ఏదో హడావుడి చేశారు. అసలేం జరుగుతుందనేది నాకయితే తెలియదు. ఇక్కడ ఎవరినైనా అనుమానించవచ్చు. గొప్ప, చిన్న అనే తేడాలేం లేవ్. కానీ నేను తప్పుచేశాననే అనుమానం ఉన్నప్పుడు నన్ను మాట్లాడనివ్వాలి కదా. గతంలో ఎంక్వైరీలు జరిగినప్పుడు మమ్మల్ని ఏమీ అడగలేదు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రం అన్నారు.


రిపోర్ట్‌లో ఏం ఉందంటే.. 2010కి ముందు నేను సెక్రటరీగా ఉన్నా. అప్పుడు కమిటీ భోగస్ కమిటీ అని, శాంక్షన్ చేసిన భూమిని కూడా వెనక్కి తీసుకోవాలని చూస్తే.. అప్పుడు ఉన్న ప్రభుత్వంతో కోట్లాడి రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ తర్వాత నేను కమిటీలో ఉన్నాను కానీ.. ఎటువంటి పదవి తీసుకోలేదు. 2015 వరకు కమిటీలోనే ఉన్నా. 2015 తర్వాత నేను కమిటీలో లేను. నేను దిగిపోయే నాటికి 2000 సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు అప్పగించడం జరిగింది. అప్పుడు ఐవిఆర్‌సిఎల్ నుంచి రూ. 30 కోట్లు రికవరీ చేయడం కూడా జరిగింది. 2015 తర్వాత నేను లేను. అలాంటిది నేను ఎలా బాధ్యుడిని అవుతాను. మొబిలైజేషన్ అడ్వాన్స్‌కి ఎవరైనా బాధ్యులు ఎలా అవుతారు? ఇది చెప్పుకోవడానికి లేదు. లెటర్ పెట్టాను.. వినేవారెవరూ లేరు. కేసు నడిచినన్నీ రోజులు నన్ను పిలుస్తారేమో అని చాలా సార్లు అనుకున్నాను. నన్నెవరూ అడగలేదు. ఆ తర్వాత చేసిన ఎంక్వైరీ అంతా తప్పు.. మళ్లీ ఎంక్వైరీ చేయాలని కోర్టు ఆర్డరిచ్చింది. ఆ ఎంక్వైరీ ఇదేనేమో.. నిజమో కాదో తెలియదు కానీ.. మా మీదు కేసు వేశారని అంటున్నారు. ఎందుకు కేసు వేశారనేది నాకయితే తెలియదు.

Also Read- Devara Trailer: దేవర.. మరో ఆచార్య! నెట్టింట రచ్చ ర‌చ్చ‌

నేను సెక్రటరీగా ఉన్నప్పుడు.. రోజు అక్కడకి వెళ్లి అందరినీ ఇంటర్వ్యూ చేసి.. నాన్ మెంబర్స్ అందరినీ తీసివేశాను. దాదాపు 1000 మంది వరకు నాన్ మెంబర్స్‌ని తీసేశాను. నేను దిగిపోయిన తర్వాత మళ్లీ కొత్త మెంబర్స్ అంటూ కొంతమందిని తీసుకున్నారు. అందులో నాన్ మెంబర్స్ ఉన్నారా? వేరే వాళ్లు ఉన్నారా? అనేది నాకు తెలియదు. మాములుగా ఇక్కడ మెంబర్స్‌ని సెలక్ట్ చేయడానికి ఫెడరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఫెడరేషన్ సర్టిఫికెట్, లేదంటే కార్డు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కమిటీకి లేదు కదా.. ఇక్కడ కార్డు ఇచ్చిన వారిది తప్పు. ఈ విషయంలో ఫెడరేషన్ వారిని కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు. అలా అప్పటి నుంచి ఏదో రకంగా ఈ ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇది పెద్ద ఇష్యూనే కాదు. త్వరలోనే సాల్వ్ అవుతుంది. అక్కడున్న పర్మిషన్ ప్రకారం చెప్పుకుంటే అన్నీ తప్పులే ఉన్నాయి. ఒక్కడిని బాధ్యుడిని చేయలేం.. అందరూ బాధ్యులే.


ఇందులో నేను 2015 తర్వాత అసలు లేను. నేను ఏం చేశానో.. ఎవరు పిలిచి అడిగినా చెబుతాను. ఇంకా అనుకుంటే తీసుకెళ్లి జైలులో పెట్టుకోమనండి. నేను అందులో ఉన్నప్పుడు రికవరీ చేసేశా. అలాంటప్పుడు నేను ఎలా బాధ్యుడిని అవుతానో నాకయితే తెలియదు. చట్టం ఏం చేయాలో అది చేస్తుంది.. నేను న్యాయ పరంగా ఎలా ఎదుర్కొవాలో అలా ఎదుర్కొంటాం. నేను తప్పు చేశానని ఆరోపణ వస్తే.. ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. లాయర్స్‌ని పెట్టుకున్నాం.. ఫైట్ జరుగుతూనే ఉంది. ఈసారైనా నన్ను అడుగుతారని ఆశపడుతున్నాను. ఇప్పుడు కేసు అని వినబడుతున్న పేర్లలో కొందరు చనిపోయినవారివి ఉంటే.. అసలెవరో కూడా తెలియని కొత్తపేర్లు కొన్ని ఉన్నాయ్. వాళ్లెవరో కూడా నాకు తెలియదు. చిత్రపురికి సంబంధించి నన్ను ఎవరు ప్రశ్నించినా.. నా వద్ద ఉన్న సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

Updated Date - Sep 11 , 2024 | 06:40 PM