Sravanthi Chokarapu: పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన ఈ నటి ఆయన కోసం ఏం చేసిందో తెలుసా?
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:08 PM
స్రవంతి చొక్కరపు నటి, యాంకర్, హోస్ట్ ఒకటికాదు ఆమె ఆల్ రౌండర్. అనుకోకుండా నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తరువాత కొన్ని సినిమాలలో నటించి, తరువాత టీవిలో హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ఫిల్మ్ ఈవెంట్స్ కి, అలాగే టీవిలో పలు షోలకి హోస్ట్ గా చేస్తున్న స్రవంతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందుకే అతని కోసం ప్రత్యేకంగా ఏం చేసిందంటే...
స్రవంతి చొక్కరపు పేరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఆమె చాలా సినిమా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ అందరికీ కనపడుతూ, అలాగే తన ఇన్స్టాగ్రామ్ లో తాజా ఫోటోలతో ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటూ వుండే స్రవంతి చక్కటి, అందమైన తెలుగు అమ్మాయి. ఈమె జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందుకే తన కుమారుడికి ఏమి పేరు పెట్టిందో తెలుసా? (Actress and anchor Sravanthi Chokarapu is a huge fan of Pawan Kalyan, thus named her son as Akira Nandan)
"నేను పవన్ కళ్యాణ్ కి మొదటి నుండీ చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను," అని చెప్పింది స్రవంతి. అంతే కాదు తాను నడుపుతున్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది.
మరి పవన్ కళ్యాణ్ కి మీ బోటిక్ నుండి ఏమైనా మంచి అవుట్ ఫిట్స్ పంపించారా అని అడిగితే, "పంపించాను, అవి అతను వేసుకున్నారు కూడా. నేను చాలా హ్యాపీగా వున్నాను," అని చెప్పారు. అయితే స్రవంతి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ని కలవలేదు. కళ్యాణ్ గారు గత కొంత కాలంగా ప్రచార సభలు, ఎన్నికలు, ఆ తరువాత ఇప్పుడు రాజకీయంగా బిజీగా వున్నారు. ఈరోజే (బుధవారం) ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అతను ఇప్పుడు తన కార్యకలాపాలతో కొన్ని రోజులు బిజీగా వుంటారు, అది అయ్యాక తప్పకుండా కలుస్తా అని చెప్పింది స్రవంతి. (Sravanthi Chokarapu is also running a botique and she named it as Akira Label because she is fan of Pawan Kalyan)
ఇంతకీ స్రవంతి నేపధ్యం ఏమిటి? ఎక్కడనుండి వచ్చింది?
"నేను అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి అక్కడే పెరిగాను. పదవ తరగతి వరకు అక్కడే చదివాను. తరువాత చదువు అంతా హైదరాబాదులో సాగింది," అని చెప్పింది తన గురించి. సీనియర్ నటుడు రాజశేఖర్ మేనకోడలు, స్రవంతి క్లాస్ మేట్స్. "ఆమె ఒకరోజు నన్ను 'మహంకాళి' సినిమా షూటింగ్ కి తీసుకువెళ్ళింది. అప్పుడు ఎవరో ఆర్టిస్టు రాకపోతే నేను బాగున్నాను అని నన్ను తీసుకున్నారు," అని చెప్పింది స్రవంతి.
అలా తను మొదటి సారిగా వెండితెరపై కనపడటం జరిగింది. అలా చదువుకుంటూ ఉండగానే సినిమాలో చాన్సు రావటం, దానికితోడు డబ్బులు కూడా రావటంతో, అలా కొన్ని సినిమాల్లో నటించింది స్రవంతి. అనుకోకుండా అలా చాన్సు వచ్చి నటిగా మారింది స్రవంతి. ఆ తరువాత ప్రశాంత్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది.
"మా పెద్దలు ఒప్పుకోకపోయినా, మేమిద్దరం వివాహం చేసుకున్నాం, మా వారు సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తారు," అని చెప్పింది స్రవంతి. వీళ్ళకి ఇప్పుడు పది సంవత్సరాల బాబు వున్నాడు. "మేము చాలా సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ హాయిగా వున్నాం, కానీ సోషల్ మీడియా వాళ్ళకే మేము అలా ఉండటం ఇష్టం లేదు," అని నవ్వుతూ చెప్పింది, ఆమె గురించి వస్తున్న గాసిప్స్ గురించి.
టీవీలో వచ్చిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్, ఓటిటి లో మొదటిసారిగా వచ్చినప్పుడు స్రవంతి కూడా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఏడు వారాలపాటు ఇంట్లో వుంది. "రోజూ కెమెరా ముందుకు వెళ్లి నన్ను బయటకి పంపించెయ్యి బిగ్ బాస్ అని చెప్పేదాన్ని," అని చెప్పింది స్రవంతి. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం ఒక మంచి అనుభూతి, ఒక అనుభవం. అంతే రెండోసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలని అనుకోకూడదు అని చెప్పింది స్రవంతి.
ఇప్పుడు ఫిల్మ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా స్రవంతి చేస్తూ ఉంటుంది, అలాగే టీవీలో కూడా హోస్ట్ గా చేస్తూ వుంది. "ఈటీవీ లో 'ఫామిలీ స్టార్' అని ఒక షో మొదలైంది. నేను, సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాం ఈ షో," అని చెప్పింది స్రవంతి. అలాగే తన సొంత బొటిక్ ని కూడా నిర్వహిస్తోంది స్రవంతి.
-- సురేష్ కవిరాయని