Konidala Anjana Devi: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై అంజనమ్మ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 03 , 2024 | 05:51 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన కన్న తల్లి కొణిదల అంజనా దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు సినిమాల కోసం కష్టపడితే.. నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్న ఆమె.. పవన్ కళ్యాణ్ జీవితంలోని ఎన్నో విషయాలను తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన కన్న తల్లి కొణిదల అంజనా దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు సినిమాల కోసం కష్టపడితే.. నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ అమ్మగారైన అంజనమ్మ తొలిసారిగా జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ తాజాగా అందుబాటులోకి తీసుకురాగా.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అంజనమ్మ ఏం చెప్పారంటే..
‘‘ఆ భగవంతుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం నా బిడ్డకు కలిగించాడు. ప్రజల కష్టం తీర్చాలని ఆయన తపన పడుతున్నాడు. మొదటి నుంచీ పట్టు పరుపులని చూడలేదు.. నేల మీదే పడుకునే వాడు. చిన్నప్పటి నుంచి కూడా తనకి ఇది కావాలని ఏనాడూ అడగలేదు. తనకున్నదానిలో సరిపెట్టుకుని వెళ్లిపోయేవాడు.
ఇంట్లో అందరూ భోజనాలు చేశాక.. ఆ తర్వాత వచ్చి తినేవాడు. తనకి నేను చేసిన పలావు అంటే చాలా ఇష్టం. పలావుని మాత్రం చాలా అమితంగా ఇష్టపడతాడు. ఇది వండి పెట్టు.. అది చేసి పెట్టు అని ఏ రోజూ నన్ను అడగలేదు. తనకోసం ఏదైనా తినాలని చేసి పెడితే మాత్రం తప్పకుండా తినేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీక్ష నా బిడ్డ చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవి. నా కోసం అయ్యప్ప మాల కూడా వేసుకున్నాడు. తనతో శబరిమల సైతం వెళ్లొచ్చాను. అలా అని ప్రతిరోజూ దండాలు పెట్టి, పూజలు ఏమీ చేయడు.
చిన్నప్పుడు అన్నప్రాసన సమయంలో కళ్యాణ్.. కత్తి, పెన్ను పట్టుకున్నాడు.
ఈ పుస్తకాల వల్లే తనకి ఈ సమాజంపై ఇంత ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అవుతాడని నేనసలు ఊహించలేదు. వారి వారి అదృష్టాన్ని బట్టి జీవితం ఉంటుంది. పెద్దబ్బాయ్ చిరంజీవి సైతం.. తన తమ్ముడు పవన్‌ని బాగా చూసుకునే వాడు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ వదిన చాటు బిడ్డే. ఎందుకంటే.. నా భర్తకు ఉద్యోగరీత్యా బదిలీలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నైలో పెద్దబ్బాయి దగ్గరే పవన్ ఉండేవాడు.
మేము శ్రీ కళ్యాణ్ కుమార్ అని చిన్నప్పుడు పేరు పెట్టాం.. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకున్నాడు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ ఆలోచన విధానం చాలా బాగుంది. నా బిడ్డ ప్రజలకు సేవ చేయడం, మంచి చేయడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కొంతమంది బాధలు వింటుంటే.. నాకు చాలా ఆవేదన కలిగిన సందర్భాలు ఉన్నాయి. మొదటి నుంచి పవన్ కళ్యాణ్‌కు సాయం చేసే గుణం ఎక్కువ ఉండేది. తన కళ్ల ముందు ఏదైనా జరిగితే వెంటనే స్పందించి ఆదుకుంటాడు.
డిప్యూటీ సీఎం అవుతాడని మాత్రం అనుకోలేదు.. అలా జరిగింది. దేవుడు ఎలా రాస్తే.. అలాగే అతను ఎదుగుతాడు. గతంలో తనను పోలీసులు అడ్డుకుంటే.. రోడ్డు మీద పడుకున్న తీరు చూసి తల్లిగా నా మనసు ఎంతో బాధపడింది. ఇంత అవసరమా?.. ఇన్ని కష్టాలు ఎందుకు పడటం అనిపించింది.
ప్రజల కోసం కష్టపడి.. ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్‌కు దేవుడు మంచి బాధ్యత ఇచ్చాడు. బిడ్డ మంచి వృద్దిలోకి రావాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది.. నేను కూడా అదే కోరుకుంటున్నాను’’ అని అంజనమ్మ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.