Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు
ABN , Publish Date - Dec 04 , 2024 | 08:41 AM
‘సర్బట్టా పరంబరై’ మూవీలో మారియమ్మ పాత్రలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచి, ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దుషార విజయన్. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
సూపర్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ.. కాళ్ళు మాత్రం భూమ్మీదే ఉంటాయని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయాన్ని తన అభిమాన హీరో రజనీకాంత్‌ను చూసి తాను నేర్చుకున్నట్టు యువ హీరోయిన్ దుషార విజయన్ చెప్పారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ఓ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న యువ హీరోయిన్ దుషార విజయన్. ‘సర్బట్టా పరంబరై’ మూవీలో మారియమ్మ పాత్రలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచి, ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దిండిగల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలోనే ధనుష్, రజనీకాంత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాప్ గేర్‌లో తన కెరీర్‌ని కొనసాగిస్తోంది.. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. అవేంటో ఓ సారి చూద్దాం...
‘వేట్టయన్’ చిత్రంలో నటించడం పట్ల మీ ఫీలింగ్?
‘రాయన్’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు కేఈ జ్ఞానవేల్ రాజా సంప్రదించారు. రజనీ, అమితాబ్ వంటి గొప్ప నటులు నటించే చిత్రం కావడంతో అది దేవుని ఆశీర్వాదంగా భావించాను. తొలి రోజే సూపర్‌స్టార్‌తో షాట్. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ‘సర్బట్టా పరంబరై’లో నా నటన బాగుందని ప్రశంసించారు.
Also Read- Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా
సూపర్‌స్టార్ వద్ద ఏం నేర్చుకున్నారు?
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత స్టార్‌డం ఉన్నప్పటికీ ఆయన సాధారణంగా ఉంటారు. ఒకే ఒక సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. తారాస్థాయికి వెళ్ళిన మన కాళ్ళు భూమ్మీదే ఉంటాయనే విషయాన్ని ఆయన వద్ద నేర్చుకున్నాను.
మీకు మంచి మంచి పాత్రలు, క్యారెక్టర్లు ఎలా వస్తున్నాయి?
మంచి కథలనో లేదా మంచి పాత్రలను వెతుక్కుంటూ నేను వెళ్ళడం లేదు. సహజసిద్ధంగా కుదుతున్నాయి. ఎవరి దగ్గరా అవకాశాల కోసం అడుక్కోవడం లేదు. బలమైన పాత్రల్లో నటించాను. అమాయక పాత్రల్లో నటించాలన్నదే నా కోరిక.
ధనుష్, రజనీ, విక్రమ్.. ఈ ముగ్గురినీ ఏ కోణంలో చూస్తారు?
ఎంతో సంతోషంగా ఉంది. విక్రమ్‌తో ‘వీర ధీర శూరన్’లో నటిస్తున్నాను. సెట్‌లో ఒకరకమైన వెర్రితనంతో నటిస్తారు. రజనీని ఓ ఉన్నత స్థానంలో ఉంచాను. ధనుష్ విషయంలో టైమ్, స్పీడ్ ముఖ్యం.
ఇంతకీ పెళ్ళి ఎపుడు చేసుకుంటారు?
నా ఇష్టాయిష్టాలను కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు.
సినిమాలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏమైనా ఉన్నాయా?
ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అనే ధోరణి నాది. నా పని నేను చేసుకుంటున్నా. ఇక్కడ ప్రశాంతంగా ఉండటమే అతిపెద్ద ఛాలెంజ్. గెలుస్తాననే నమ్మకం ఎంతో ముఖ్యం. ఎమోషనల్‌గా ఉండేవారికి ఈ సినిమా ఫీల్డ్ సరిపోదు.
అంటే ప్రతిభ ఒక్కటే సరిపోతుందా?
నేను మోడలింగ్ నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. సినిమా వదిలివేసి ఇంటికెళ్ళినా మూడు పూటలా అన్నంపెట్టి నన్ను మహారాణిలాగా నా తల్లిదండ్రులు చూసుకుంటారు.
మీ డ్రీమ్ రోల్?
ప్రియాంకా చోప్రా బయోగ్రఫీలో నటించాలన్న ఆశ ఉంది. ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.