Vikram: స్త్రీలకు రక్షణ కల్పించాలి.. మొత్తం వ్యవస్థ మారాలి!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:50 PM

స్త్రీలకు సంరక్షణ (Women's Safety) కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చియాన్‌ విక్రమ్‌ (Vikram) కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

స్త్రీలకు సంరక్షణ (Women's Safety) కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చియాన్‌ విక్రమ్‌ (Vikram) కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘మహిళలందరికీ రక్షణ కల్పించాలి. తెల్లవారుజామున 3.00 గంటలకు సైతం మహిళలు  స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలి. ఆ సమయంలోనూ బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి వెళ్లగలమనే నమ్మకం వారికి కలగాలి. ప్రతి పురుషుడు ఆమెను రక్షించడానికి, వారికి సురక్షిత స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే బాధ కలుగుతుంది. చుట్టూ జరిగే చాలా విషయాల గురించి తెలిసినప్పుడు భావోద్వేగానికి గురవుతాం. నేనే కనుక క్రియేటివ్‌ సైడ్‌ ఉండుంటే నా సినిమాల ద్వారా ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పగలనా? ఏదైనా చేయగలనా? అని తరచూ ఆలోచిస్తుంటా. మనం ఏం చేయాలి? దేశం మొత్తం ఏం చేయాలి? పా.రంజిత్‌ చెప్పినట్టు.. మొత్తం వ్యవస్థ మారాలి. మొదటి నుంచి మళ్లీ ప్రారంభించాలి. కానీ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి’’ అని అన్నారు.


ఆయన హీరోగా పా.రంజిత్‌(PA Ranjith) దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం 'తంగలాన్‌’. ఆగస్టు 15న దక్షిణాదిలో విడుదలైన ఈ చిత్రం అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. త్వరలో ఇది హిందీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విక్రమ్‌ పాల్గొన్నారు. తన సినిమా విశేషాలతోపాటు ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులు, హేమ కమిటీ రిపోర్ట్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Aug 26 , 2024 | 05:50 PM