యంగ్ దర్శకుడి గొప్ప మనసు: డిస్ట్రిబ్యూటర్ల ప్రశంసలు
ABN , Publish Date - Nov 15 , 2024 | 09:31 AM
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు వినిపిస్తుంటాయి. ఆ మంచి చేసిన వారి పేరు వైరల్ కూడా అవుతుంటుంది. ఇప్పుడు అలాంటి మంచి పనినే చేశారు ‘జైలర్’ దర్శకుడు నెల్సన్. ఇంతకీ ఆయన ఏం మంచి చేశారు? అనేది తెలుసుకోవాలంటే..
కవిన్ హీరోగా నటించిన ‘బ్లడీ బెగ్గర్’ (Bloody Beggar) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ కారణంగా ఈ సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టాన్ని చవిచూశారు. వీరిని ఆదుకునేందుకు ఆ చిత్ర నిర్మాత, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) పెద్దమనసు చాటుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ మంచి మనసును అంతా కొనియాడుతున్నారు.
Also Read-Chaitu Jonnalagadda: నాని కూడా ఆశ్చర్యపోయేలా.. పాన్ మసాలా ఫిల్మ్‌కి టైటిల్ ఫిక్స్
విషయంలోకి వస్తే.. ‘బ్లడీ బెగ్గర్’ మూవీ తమిళనాడు (Tamil Nadu) పంపిణీ హక్కులను ఫైవ్‌స్టార్ సెంథిల్ రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ సినిమా కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఇతర ఖర్చులతో కలిపి దాదాపు రూ.7 కోట్ల మేరకు నష్టాలను చవి చూశారు. అయితే, నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ మధ్య జరిగిన ఒప్పందంలో నష్టం వాటిల్లినా నిర్మాత డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్న కండిషన్ ఉంది.. అయినప్పటికీ నెల్సన్ దిలీప్ కుమార్ పెద్ద మనసుతో ఫైవ్‌స్టార్ సెంథిల్‌తో పాటు ఇతర డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
Also Read- Kasthuri: నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
నెల్సన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పంపిణీదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. అదే సమయంలో ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నెల్సన్ సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే శాటిలైట్ రైట్స్ విక్రయించడం ద్వారా ఆయన భారీగానే లాభాలను చవిచూసినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తెరకెక్కించిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు భారీగానే ఆయనకు రెమ్యునరేషన్ అందినట్లుగా వార్తలు వచ్చాయి. ‘జైలర్’ నిర్మాత ఓ ఖరీదైన కారు కూడా నెల్సన్‌కు కొనిచ్చారు.