Cinema Industry: షూటింగుల బంద్ నిర్ణయంపై పున:పరిశీలన చేయండి
ABN , Publish Date - Sep 10 , 2024 | 02:01 PM
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన సమస్య.. ఇప్పుడు కోలీవుడ్‌కి చేరింది. సమస్యల పరిష్కారం నిమిత్తం నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా షూటింగ్స్ నిలిపివేయాలనే నిర్ణయాన్ని తీసుకున్న నిర్మాతల మండలికి.. నడిగర్ సంఘం ఓ విజ్ఞప్తి చేసింది.
నవంబరు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలని తమిళ చిత్ర నిర్మాతల మండలికి నడిగర్ సంఘం విఙ్ఞప్తి చేసింది. నటీనటుల పారితోషికాలు, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తదితర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో నవంబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా షూటింగులను నిలిపివేయాలని నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కోలీవుడ్‌లో బంద్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం (Nadigar Sangam) ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read- Tollywood: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ లో గొడవేంటి ...
నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు తేనాండల్ మురళి రామస్వామి సారథ్యంలో నిర్వాహకుల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఇందులో ఆగస్టు నెల 18వ తేదీ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం నిర్వాహకుల మధ్య జరిగిన సమాచాలోచన సమావేశంలో నటీనటులు - నిర్మాతల మధ్య జరిగిన 11 అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా ధనుష్ వంటి పలువురు హీరోల వల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యతో పాటు ఇతర అంశాలను కూడా నిర్మాతల మండలి మరోమారు నడిగర్ సంఘం దృష్టికి తీసుకెళ్ళింది.
ఈ సమావేశ చర్చల అనంతరం ఇరు సంఘాల నిర్వాహకులు మరోమారు సమావేశమై, కొత్తగా అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అదేసమయంలో నడిగర్ సంఘం ప్రతినిధులు కూడా నిర్మాతల మండలికి ఒక విజ్ఞప్తి చేసింది. నవంబరు ఒకటో తేదీ నుంచి షూటింగుల నిలిపివేత నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలని నడిగర్ సంఘం కోరింది. ఇటీవల టాలీవుడ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నప్పుడు ఓ 10 రోజుల పాటు షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Read Latest Cinema News