Kasthuri: ఇళయరాజాకు గుడిలో అవమానం.. నటి కస్తూరి ఏమన్నారంటే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 09:30 PM
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై నటి కస్తూరి సంచలన కామెంట్స్ చేశారు.
ఏ ఒక్క ఆలయంలో కూడా గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదని సినీ నటి కస్తూరి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అవి నిజం కావని ఆలయ అధికారులు, శడగోప రామానుజ జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆలయంలో మార్గశిర మాస వేడుకల్లో భాగంగా దివ్య పాశుర సంగీత కచ్చేరి, భరతనాట్య కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..
ఇందులో శ్రీవిల్లిపుత్తూరు శడగోప రామానుజ జీయర్, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, ప్రత్యేక అతిథిగా ఇళయరాజా పాల్గొన్నారు. ఆండాళ్ సన్నిధి, నందవనం, పెరియ పెరుమాళ్ సన్నిధిలను రామానుజ జీయర్, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణలతో కలసి ఇళయరాజా దర్శనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వసంతమండపం దాటి అర్థమండపం ద్వారం వద్ద నిలుచున్నారు. దీన్ని గమనించిన పూజారులు వసంత మండపంలో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పడంతో ఇళయరాజా అలాగే చేశారు. దీనికే ఆయనకు అవమానం జరిగినట్లుగా కొందరు వార్తలను ప్రచారం చేశారు.
శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగిందంటూ జరిగిన ప్రచారంపై నటి కస్తూరి మీడియాతో మాట్లాడారు. ఆలయానికి వెళ్ళిన ఇళయరాజాకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పట్టువస్త్రం, ప్రసాదాలను అందజేశారన్నారు. ఇళయరాజాకే కాదు ఏ ఒక్కరికీ గర్భాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని, అందువల్ల ఇళయరాజాకు ఆండాల్ ఆలయంలో ఎలాంటి అవమానం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. ఇళయరాజా కూడా తనపై ప్రచారం అవుతున్న వార్తలపై స్పందించి ఖండించారు.