Jama: వీధి నాటక కళాకారుల కథాంశంతో ‘జమా’.. విడుదల ఎప్పుడంటే?
ABN , Publish Date - Jul 18 , 2024 | 08:52 PM
ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ‘కూళంగల్’ చిత్రాన్ని నిర్మించిన లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ ‘జమా’ పేరుతో సామాజిక స్పృహతో కూడిన కథాంశంతో ఓ చిత్రాన్ని నిర్మించింది. పారి ఇళవళగన్ హీరోగా నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్టుకు ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీతం అందించేందుకు అంగీకరించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచానాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ తెలియజేశారు.
ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ‘కూళంగల్’ చిత్రాన్ని నిర్మించిన లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ ‘జమా’ (Jama) పేరుతో సామాజిక స్పృహతో కూడిన కథాంశంతో ఓ చిత్రాన్ని నిర్మించింది. పారి ఇళవళగన్ హీరోగా నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్టుకు ఇసైఙ్ఞాని ఇళయరాజా (Isaignani Ilayaraja) సంగీతం అందించేందుకు అంగీకరించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచానాలు పెరిగిపోయాయి. ఇందులో హీరోయిన్‌గా అమ్ము అభిరామి నటించగా.. నటులు చేతన్, శ్రీకృష్ణ దయాళ్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ తేదీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా వివరాలను చిత్ర దర్శకుడు పారి ఇళవళగన్, నటుడు చేతన్, నిర్మాత సాయి దేవానంద్‌లు చెన్నై నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘వీధి కళాకారుల జీవనశైలి, వారు ఎదుర్కొనే సవాళ్ళు, కష్టాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రధానంగా వీధి నాటకాల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరిస్తుంటారు. తిరునెల్వేలి జిల్లాలోని పిన్నకొండాపట్టి అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఒక వీధి నాటక బృందానికి (జమా) చెందిన కథనే ఎంచుకున్నాం. దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా రూపొందించాం. ఇందులో నటించిన వారంతా వీధి కళాకారులే. నటుడు చేతన్ పాత్ర చాలా కీలకమైంది. నాటక బృందం నాయకుడిగా నటించారు. మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇందులో ఒక పాటను వీధి నాటక కళాకారులతోనే పాడించడమే కాకుండా, వారు వినియోగించే వాయిద్య పరికరాలనే ఉపయోగించాము’ అని వివరించారు. (Jama Release Date)
నటుడు చేతన్ (Chetan) మాట్లాడుతూ.. చాలా యేళ్ళుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నాను. ‘విడుదలై’ చిత్రం నా కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నానన్నారు. నిర్మాత సాయి దేవానంద్ మాట్లాడుతూ, ‘కూళంగల్’ చిత్రాన్ని నేటివిటీకి చాలా దగ్గరగా తీశాం. అదేవిధంగా వీధి నాటక కళాకారుల జీవనశైలిని కళ్ళముందు తెలిపేలా ‘జమా’ను రూపొందించాం. తొలి చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయలేకపోయాం. అందుకే ఈ సినిమాను పిక్చర్ బాక్స్ కంపెనీతో కలిసి సొంతంగా రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.