Star Heroes Movies: ఇంకా 3 నెలలు.. ఆ 4 చిత్రాలపైనే భారీ అంచనాలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 12:49 PM
ఈ యేడాదిలో మరో మూడు నెలలు మాత్రమే మిగిలివున్నాయి. ఈ కాలంలో విడుదల కానున్న చిత్రాల్లో ప్రధానంగా నాలుగు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ యేడాదిలో మరో మూడు నెలలు మాత్రమే మిగిలివున్నాయి. ఈ కాలంలో విడుదల కానున్న చిత్రాల్లో ప్రధానంగా నాలుగు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ (Vettaiyan), శివకార్తికేయన్ ‘అమరన్’ (Amaran) దీపావళికి విడుదలకానున్నాయి. ఆ తర్వాత సూర్య నటించిన ‘కంగువా’ (Kanguva).. సూరి, విజయ్ సేతుపతి నటించిన ‘విడుదలై-2’ (Viduthalai Part 2) విడుదలవుతాయి. వీటితో పాటు మరికొన్ని చిన్నబడ్జెట్ చిత్రాలు వరుసలో ఉన్నాయి. అయితే, కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్, శింబు వంటి పెద్ద హీరోల చిత్రాలు ఈ దీపావళి రేసులో లేకపోవడం వారి అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. వాస్తవానికి కమల్ ‘థగ్‌లైఫ్’, అజిత్ ‘విడాముయర్చి’ చిత్రాలు ఈ యేడాది విడుదలవుతాయని అభిమానులు భావించారు. కానీ, 2025 సంక్రాంతికి ఈ చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
రజనీకాంత్ ‘వేట్టయన్’...
‘జైభీమ్’ ఫేం టీజే ఙ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజువారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్ ప్రధాన తారాగణం. ‘ఎన్కౌంటర్’ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. అయితే, ఈ సినిమా రజనీ హీరోయిజంకు, ఆయన సినీ కెరీర్‌కు ఏ మేరకు ఉపయోగపడుతుందన్నదే ప్రశ్నగా ఉంది. ఈ రెండు అంశాలుంటే మాత్రం సూపర్‌స్టార్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిపోనుంది. అక్టోబరు 10న విడుదలయ్యే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, నిర్మాత సుభాస్కరన్.
సూర్య ‘కంగువా’...
చిరుత్తై శివ దర్శకత్వంలో సూర్య, బాబీ డియోల్, దిశా పఠానీ తదితరులు నటించగా, ఏకంగా పదికిపైగా భాషల్లో రూపొందిన చిత్రం ‘కంగువా’. నవంబరు 14న విడుదలకానుంది. నిజానికి అక్టోబరు 10నే విడుదల కావాల్సివుండగా, ‘వేట్టయన్’ కోసం సూర్య వెనక్కితగ్గారు. తమిళ చిత్రపరిశ్రమలో ఇటీవల చరిత్ర ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్-1, 2’, ‘తంగలాన్’ ఈ కోవకు చెందిన చిత్రాలే. ఇపుడు ‘కంగువా’ రానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందుతుందా? లేదా? వేచి చూడాల్సిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Also Read- Pawan Kalyan: ఆ ఆడియో రికార్డు రూపొందించిన కీరవాణికి ధన్యవాదాలు
శివకార్తికేయన్ ‘అమరన్’...
శత్రుదేశాల సైనికులతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. 2017లో వచ్చిన ‘రంగూన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేశారు. ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటించారు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి నిర్మాత. వీరమరణం పొందిన పలువురు సైనికుల జీవిత చరిత్ర, యథార్థ సంఘటనలు ఆధారంగా హిందీలో అనేక చిత్రాలు రాగా, అవన్నీ ఘనవిజయం సాధించాయి. ఈ కోవలో తమిళంలో వస్తున్న తొలి చిత్రంగా ‘అమరన్’ నిలిచింది. దీపావళి రేసులో ఉండే చిత్రాల్లో మొదటి వరుసలో ఈ మూవీ ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
సూరి - విజయ్ సేతుపతి ‘విడుదలై-2’
జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో గత యేడాది వచ్చిన ‘విడుదలై’ చిత్రానికి ఇది సీక్వెల్. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూరి, విజయ్ సేతుపతి, మంజూ వారియర్, భవానీశ్రీ నటించారు. డిసెంబరు 20న విడుదలకానుంది. కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం.
మరో 30 చిత్రాలకు అవకాశం...
ఈ యేడాదిలో ఇప్పటివరకు కోలీవుడ్‌లో సుమారు 170 చిత్రాలు విడుదలయ్యాయి. వచ్చే మూడు నెలల్లో మరో 30 వరకు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో కలుపుకుంటే ఈ యేడాది విడుదలయ్యే సినిమాల సంఖ్య 200 దాటొచ్చని భావిస్తున్నారు. అయితే, వీటిలో పెద్ద హీరోలు నటించిన చిత్రాల సంఖ్య మాత్రం కేవలం 20లోపే ఉండటం గమనార్హం.