Friday Release: 2024 ఆఖరి శుక్రవారం.. ఎన్ని సినిమాలు విడుదలంటే...
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:11 PM
2024 సంవత్సరం ఎండింగ్‌కు వచ్చేసింది. ఈ సంవత్సరంలో చివరి శుక్రవారాన్ని చిన్న సినిమాలు ఆక్రమించేశాయి. దాదాపు 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరీక్షకు వచ్చేశాయి. మరి వీటిలో ఏవి సక్సెస్ సాధిస్తాయో తెలియదు కానీ.. 2024కు మాత్రం 10 సినిమాలతో మంచి ముగింపునిచ్చారనేలా టాక్ మొదలైంది. విషయంలోకి వస్తే..
ఈ యేడాది (2024)లో చివరి శుక్రవారమైన 27వ తేదీ ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పది చిత్రాలు విడుదలవుతున్నాయి. సాధారణంగా ప్రతి యేటా చివరి శుక్రవారం రోజున అధిక సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఆ కోవలోనే ఈవారం కూడా ఏకంగా పది చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం. వీటిలో ప్రముఖ నటుడు సముద్రఖని నటించినవి రెండు చిత్రాలున్నాయి. అలాగే, సుప్రీంస్టార్ శరత్ కుమార్ నటించిన చిత్రం ఉంది. మిగిలినవన్నీ చిన్న హీరోల సినిమాలు కావడం గమనార్హం.
Also Read- CM Revanth Reddy: ఫైనల్‌గా సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన సూచనలివే..
నేడు విడుదలయ్యే చిత్రాల జాబితాలో ‘అలంగు’, ‘భీమా చిట్రుండి’, ‘ఇదు ఉనక్కు తేవైయా’, ‘కూరన్’, ‘మళైయిల్ ననైగిరేన్’, ‘నెంజు పొరుక్కుదిల్లైయే’, ‘రాజాకిలి’, ‘తిరుమాణిక్యం’, ‘ద స్మైల్ మెన్’, ‘వాగై’ వంటి సినిమాలున్నాయి. వీటితో పాటు మోహన్‌లాల్ నటించిన ‘బరోజ్’ త్రీడీ సినిమా, కిచ్చా సుదీప్ నటించిన ‘మాక్స్’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే, ఈ యేడాది సుమారుగా 230 నుంచి 240 చిత్రాల వరకు కోలీవుడ్‌లో విడుదలయ్యాయి. అయితే, గత యేడాదితో పోల్చితే మాత్రం ఈ సంఖ్య తక్కువగానే ఉందని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉందని, ముఖ్యంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాగా డిజప్పాయింట్ చేసిన సంవత్సరంగా 2024 నిలిచిపోతుందని కోలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాక, భారీ బడ్జెట్‌తో పాటు అంతే అంచనాలతో వచ్చిన సినిమాలు ‘ఇండియన్ 2’, ‘కంగువా’ కోలీవుడ్ బాక్సాఫీస్‌ని కుదేల్ చేశాయని వారు పేర్కొంటున్నారు. 2025లో అయినా కాస్త పుంజుకుని మంచి మంచి సినిమాలతో వచ్చి కోలీవుడ్‌కు సక్సెస్‌ని ఇవ్వాలని నిర్మాతలు పిలుపునిస్తున్నారు.