Mari Selvaraj: నా జీవితంలో కోలుకోలేని విషాదమే ఈ చిత్రం
ABN , Publish Date - Jul 21 , 2024 | 06:27 PM
‘కర్ణన్’, ‘మామన్నన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘వాళై’. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు.
‘నా వాస్తవిక జీవితంలో ప్రభావితం చేసిన అంశాలే ఈ సినిమా స్టోరీ. నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకునేందుకు తీసిన చిత్రం. ఇందులోని పాత్రలన్నీ నా జీవితంలో చూసినవి. ఆ పాత్రలన్నీ ఇప్పటికీ సంచరిస్తున్నాయి. నా జీవితంలో కోలుకోలేని విషాదమే ‘వాళై’ సినిమా అని ఆ చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) అన్నారు. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘వాళై’(Vaazhai). ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇటీవల రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సెల్వరాజ్ (Mari Selvaraj) మాట్లాడుతూ, ‘తాను తొలిసారి దర్శకత్వం వహించాలనుకున్న చిత్రం ‘వాళై’. రూ.50 లక్షలుంటే సినిమా తీయొచ్చన్న భావనలో చిన్న బడ్జెట్ చిత్రం. తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన స్టోరీ. సమయం దొరికినపుడు మాత్రమే సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని ఎంతో ఓపికతో ఉన్నాను. ‘తొలుత ‘పరియేరుం పెరుమాళ్’ తీశాను. ఆ తర్వాత ‘కర్ణన్’, ‘మామన్నన్’ చిత్రాలను దర్శకత్వం వహించాను. ‘వాళై’ నా మనసుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది.
ఈ సినిమా తర్వాత పా.రంజిత్ నిర్మించే చిత్రంతో పాటు నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తాను. నా చిత్రాల్లో కనిపించే పాత్రలన్నీ నిజ జీవితంలో నేను చూసినవే. వారు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. అందుకే ఆందోళనగా ఉంటుంది. సంతోష్ నారాయణన్ పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతగానో శ్రమించారు. జీవితంలో కోలుకోలేని విషాదం నా భార్య దివ్య వియోగం. మీరు నన్ను అర్థం చేసుకునేందుకు మాత్రమే నిర్మించిన చిత్రం ఇది’ అని పేర్కొన్నారు.