Suriya: సింగం.. నరసింహం ఏం మాట్లాడుకున్నారంటే..
ABN , Publish Date - Nov 09 , 2024 | 03:28 PM
దీపికా పదుకొణె, సమంత మీ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు జ్యోతికను హీరోయిన్‌గా పెట్టుకుంటానని చెప్పారు సూర్య.
నందమూరి బాలకృష్ణ (NBK) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో (Unstoppable 4) ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సూర్య (Suriya) ఈ షోలో పాల్గొన్నారు. తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. కెరీర్ మొదట్లో తగిలిన ఎదురు దెబ్బల గురించి మాట్లాడారు. దీపికా పదుకొణె, సమంత మీ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు జ్యోతికను హీరోయిన్‌గా పెట్టుకుంటానని చెప్పారు సూర్య. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా.. మల్టీస్టారర్ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే బాలయ్య ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానమిచ్చారు సూర్య. 'నాకు అందరితో వర్క్ చేయాలనుంది. ముగ్గురు గొప్ప చిత్రాలు అందించారు. మల్టీస్టారర్ కాబట్టి మూడు భాగాలుగా చేద్దాం. ఒక్కో పార్టుకు ఒక్కొక్కరు దర్శకత్వం వహిస్తారు అన్నారు.
దాని కోసమే సినిమాల్లోకి వచ్చా..
అనుకోకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నటుణ్ణి కావాలని కలలో కూడా అనుకోలేదు. నాన్న శివకుమార్ మంచి నటుడు. ఆయన దాదాపు 175 సినిమాల్లో యాక్ట్ చేశారు. నాకు గార్మెంట్ ఇండస్ర్టీపై ఆలోచన ఉండి ఆ రంగంలో స్థిరపడాలనుకున్నా. దానికి అవసరమైన పెట్టుబడిని నాన్నని అడగాలనుకున్నా. నాన్నకు తెలియకుండా రూ.25 వేలు అప్పు తీసుకున్నానని.. ఆరు నెలలు అయినా చెల్లించలేకపోయానని ఒకరోజు అమ్మ నాతో చెప్పారు. ఆ మాట విని షాకయ్యా దేవుడి దయ వల్ల ఆ సమయంలోనే దర్శకుడు వసంత్, మణిరత్నం మా ఇంటికి వచ్చారు. తాము తెరకెక్కిస్తోన్న సినిమాలో ఒక నటుడు వైదొలగాడని.. అతని స్థానంలో నన్ను తీసుకుంటామని అడిగారు. రూ. 50 వేలు జీతంగా ఇస్తామన్నారు. వెంటనే మణిరత్నం కాళ్లు పట్టుకొని ఆ డబ్బు తీసుకొని అమ్మకు ఇచ్చా. ఆ విధంగా డబ్బు కోసం నేను సినిమాల్లోకి వచ్చా. ప్రేక్షకులు చూపిస్తోన్న ఈ ప్రేమ చూశాక.. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమకు ఎంతో రుణపడి ఉంటా. పేద విద్యార్థుల కోసం ‘అగరం’ ఫౌండేషన్ నడిపిస్తున్నా. తెలుగువారు ఎంతోమంది విరాళాలు అందించారు. దాదాపు 14 ఏళ్లలో 6000 మంది విద్యార్థులకు మేము సాయం అందించాం.
చాలా ముఖ్యమైన వ్యక్తి తను
జ్యోతికపై ప్రేమ ఎక్కడ, ఎలా మొదలైందో మాక్కూడా తెలీదు. మేము మంచి స్నేహితులం. ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసుకోలేదు. కానీ, ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని అర్థమైంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పెద్దల అంగీకారం కోసం ఎదురు చూశాం. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మా సోదరి వివాహమైన తర్వాత పెళ్లి చేసుకున్నాం. జ్యోతిక లేకుండా ఈ జీవితాన్ని నేను ఊహించుకోలేను. జ్యోతిక లేకపోతే నేను ఏమయ్యేవాడినో తెలియదు. ఇప్పుడు మా కుటుంబంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి తను. నా ఫ్రెండ్, గైడ్. ఆమె నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా.
మొదటి సక్సెస్ కోసం ఎన్నేళ్లు పట్టిందంటే...
నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. నా లుక్స్ గురించి చాలా మాటలు అన్నారు. నటుడి తనయుడు కాబట్టే నటుడు అయ్యాడని ఎంతో మంది కామెంట్లు చేశారు. కెమెరా వైపు చూడలేకపోయేవాడిని. డైలాగులు చెప్పలేకపోయేవాడిని. నా కుటుంబం కోసం నిలబడాలనుకున్నా. నా మొదటి ఎనిమిది సినిమాలు సరిగ్గా లేవు. మొదటి విజయాన్ని రుచి చూడటానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. ఆ సమయంలో నా స్నేహితులతో కలిసి ఎంతోమంది గురువులను కలిశాను. సానుకూల దృక్పథం గురించి తెలుసుకున్నా. సమస్య ఏదైనా సరే తప్పకుండా పరిష్కారం ఉంటుందని. మనం బలంగా కోరుకుంటే ఏదైనా సాధించగలమని అర్థమైంది.
వాడు ఉంటే చాలు..
కార్తికి నాకు మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. చిన్నతనంలో తనని బాగా ఏడిపించేవాడిని. రాత్రుళ్లు గదిలో లైట్స్ ఆపేసి.. కళ్లకు పౌడర్ రాసుకొని.. టార్చ్ లైట్ ముఖంపై వేసుకొని కార్తిని భయపెట్టేవాడిని. తను యూఎస్ వెళ్లినప్పుడు బాధగా అనిపించింది. దాదాపు మూడేళ్లు తను అక్కడే ఉన్నాడు. అప్పుడు మా మధ్య అనుబంధం పెరిగింది. కార్తి దుస్తులు నేను వేసుకుంటా. కానీ తను నా దుస్తులు వేసుకుంటే కోపం వచ్చేస్తుంది. తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. తను ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఇబ్బంది లేదు.
క్రష్ ఎవరో చెప్పను...
నా మొదటి క్రష్ ఎవరో చెప్పను కానీ అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ఫోన్ లైన్‌లోకి వచ్చిన కార్తి 'మా అన్నకు నటి గౌతమి అంటే చాలా ఇష్టం’ అని చెప్పాడు. దానికి సూర్య 'నువ్వు కార్తి కాదురా కత్తిరా’ అన్నారు.
వారితో మల్టీస్టారర్
కమల్‌హాసన్, రజనీకాంత్ ఇద్దరికీ నేను వీరాభిమానిని. రజనీకాంత్ 1975లో ఇండస్ర్టీలోకి వచ్చారు. అదే ఏడాది నేను పుట్టాను. కమల్ హాసన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మేము ముగ్గురం కలిసి మల్టీస్టారర్ చేేస్త బాగుంటుందని నా భావన.