Sreelekha Mitra: ఆడిషన్‌కు వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:03 PM
మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ (hema commitee) ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది.
మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ (hema commitee) ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. దీనిపై పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై(Ranjith Balakrishnan) బెంగాలీ నటి శ్రీలేఖ (Sreelekha Mitra) కీలక ఆరోపణలు చేశారు. రంజిత్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని చెప్పారు. 2009లో ఒక సినిమా ఆడిషన్ కోసం సంప్రదించానని ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు.
‘‘పలేరి మాణిక్యం’ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా. ఆడిషన్లో భాగంగా దర్శకుడిని కలిశా. సినిమాటోగ్రాఫర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆయన నా చేతి గాజులను తాకారు. నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అనంతరం నా మెడపై చేయి వేశారు. అక్కడ ఉండలేక వెంటనే ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేశా. ఆ సమయంలో ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పలేకపోయా. ఆ రాత్రి మొత్తం హోటల్ రూమ్‌లో భయపడుతూ ఉన్నాను. ఎవరైనా వచ్చి తలుపు కొడతారేమోనని కంగారుపడ్డాను. త్వరగా తెల్లవారితే బాగుండును అనుకున్నా. ఈ సంఘటన తర్వాత ఇంటికి వెళ్లడానికి నాకు రిటర్న్ టికెట్లు కూడా ఇవ్వలేదు. దీని తర్వాత మలయాళీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని శ్రీలేఖ మిత్రా తెలిపారు.
నటి ఆరోపణలపై దర్శకుడు, కేరళ రాష్ట్ర చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ స్పందించారు. అవన్నీ ఆరోపణలు మాత్రమేనన్నారు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై కేరళ మంత్రి సాజీ చెరియన్ స్పందించారు. ‘‘ఆమె బహిరంగంగా ఆరోపణలు చేశారు. దర్శకుడు వాటిని ఖండించారు. ఈ విషయంపై ఆమె ఫిర్యాదు చేసి ఉంటే దర్యాప్తు చేయవచ్చు. విచారణ లేకుండా ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని భావించలేం’’ అని అన్నారు.