Radhika Sarathkumar: సెట్‌లో అదే మా ప్రైవేట్‌ ప్లేస్‌.. కానీ..

ABN , Publish Date - Aug 31 , 2024 | 11:28 AM

మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema committee Report) సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలపైనా పడింది. తాజాగా నటి రాధిక (Radhika) హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి మాట్లాడారు.

మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema committee Report) సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలపైనా పడింది. ఇప్పుడు మహిళలు ఒక్కొక్కరుగా గొంతెత్తి తమ సమస్యలను బయటపెడుతున్నారు. స్టార్‌లు సైతం ఈ విషయంపై స్పందించారు. తాజాగా నటి రాధిక (Radhika) హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి మాట్లాడారు. మలయాళ (Mollywood) చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కొంతమంది వ్యక్తులు నటీమణుల కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలున్నాయని ఆమె ఆరోపించారు. (Radhika Sarathkumar)

‘‘చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరం. 46 ఏళ్ల నుంచి నేను ఈ పరిశ్రమలో ఉన్నా.  అన్నిచోట్లా ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయని నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటనను ఎప్పటికీ మర్చిపోను. షాట్‌ ముగించుకుని నేను వెళ్తుండగా.. సెట్‌లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్‌లో ఏదో చూస్తు నవ్వుకుంటున్నారు. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి..  ఏం చూస్తున్నారని అడిగా. కారవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్‌లో చూస్తున్నారని తెలిసింది. ఈ విషయంపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్‌లో ఏమైనా కెమెరాలు పెడితే తగిన బుద్థి చెబుతానని ఆ టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చా. ఆ ఘటన తర్వాత నాకు కారవాన్‌ ఉపయోగించాలంటే భయం పట్టుకుంది. దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి.. ఇలా పలు వ్యక్తిగత పనులకు సెట్‌లో అదే మా ప్రైవేట్‌ ప్లేస్‌’’ అని రాధిక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Radhika-a.jpg

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై ఓ నివేదిక బహిర్గతం అయ్యింది. ఈ నివేదికను ఉద్దేశించి సీనియర్‌ నటి, సీరియల్‌ ప్రొడ్యూసర్‌ కుట్టి పద్మిణి (Kutti padmini) స్పందిస్తూ.. తమిళ టీవీ పరిశ్రమలోనూ మహిళలకు వేధింపులని తప్పడం లేదన్నారు. వాటిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందర్భాలున్నాయని వ్యాఖ్యలు చేశారు. అలాగే మరో నటి ఖుష్బూ ఈ రిపోర్ట్‌పై మాట్లాడుతూ.. ‘‘కెరీర్‌లో రాణించాలనుకుంటే వేధింపులు, కమిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్నిరంగాల్లోనూ ఎదురవుతున్నాయి. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం దురదృష్టకరం. బాధితులకు పురుషులు సైతం సపోర్ట్‌ ఇవ్వాలి. మీ ప్రేమ, మద్దతును వారికి అందజేయండి’’ అని కోరారు. 

Updated Date - Aug 31 , 2024 | 11:30 AM