High court - Vishal: ఇదేమీ సినిమా షూటింగ్‌ కాదు.. విశాల్‌పై హైకోర్ట్‌ ఆగ్రహం!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:33 PM

లైకా ప్రొడక్షన్స్  సంస్థ పెట్టిన కేసు విచారణలో విశాల్‌ తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్లిన ఆయన్ని ప్రశ్నించింది.

లైకా ప్రొడక్షన్స్ (Lyca productions) సంస్థ పెట్టిన కేసు విచారణలో విశాల్‌ (Vishal) తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్లిన ఆయన్ని ప్రశ్నించింది. ఇందులో భాగంగా లైకాతో జరిగిన ఒప్పందం గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా.. అది తన దృష్టికి రాలేదని.. తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని చెప్పారు. దీనిపై జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఖాళీ పేపర్‌పై మీరెలా సంతకం చేశారు? తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా? ఇదేమీ సినిమా షూటింగ్‌ కాదు.. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి ’’ అని ఆదేశించింది. ‘‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా?’’ అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు విశాల్‌ ఆసక్తి చూపించలేదు. ‘‘ఇలా ప్రవర్తిస్తే కుదరదు. అవును, లేదా కాదు అని సమాధానం చెప్పండి’’ అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

అసలు విషయం ఏంటంటే.. విశాల్‌, నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో వివాదాలు తలెత్తాయి. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్‌ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో గానీ, ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదంటూ స్టే ఇచ్చింది.  అయితే, కోర్టు తీర్పును విశాల్‌ ఉల్లంఘించారని, డిపాజిట్‌ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండానే ఆయన నటించి, నిర్మించిన పలు సినిమాలు విడుదల చేశారని విశాల్‌పై లైకా సంస్థ జూన్‌ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్‌ చేసింది. కానీ, అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో, న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.  



  

Updated Date - Aug 02 , 2024 | 04:33 PM