RIP Delhi Ganesh: కోలీవుడ్‌లో విషాదం.. ఢిల్లీ గణేశ్‌ ఇక లేరు

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:11 AM

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేష్‌ కన్నుమూశారు. ఆయన అసలు పేరు గణేశన్‌. గత కొంతకాలంగా వృద్థాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు.


కోలీవుడ్‌లో (kollywood) విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేష్‌ (Delhi Ganesh)కన్నుమూశారు. ఆయన అసలు పేరు గణేశన్‌. గత కొంతకాలంగా వృద్థాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలని, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. (Delhi Ganesh Is nor more)

ఢిల్లీ గణేష్‌ ఆగస్ట్‌ 1, 1944లో తమిళనాడు తిరునెల్వెలిలొ జన్మించారు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా ఆయన పరిచయమయ్యారు. 1981లో 'ఎంగమ్మ మహారాణి’ చిత్రంలో హీరోగా నటించారు. అక్కడి నుంచి తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రావడానికంటే ముందు ఆయన ఢిల్లీకి సంబంధించిన థియేటర్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నారు. 1964 నుంచి 1974 వరకూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు తన సేవల్ని అందించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. గణేశన్‌ను నటుడిగా పరిచయం చేసిన కె.బాలచందర్‌ ఆయనకు ఢిల్లీ గణేష్‌ అని నామకరణం చేశారు. సినిమాల్లో ఎక్కువగా ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కనిపించారు. అందులోనూ వైవిఽధ్యమైన పాత్రలనే ఎంపిక చేసుకుని కమెడీయన్‌గా, విలన్‌, తండ్రిగా, అన్నగా ఎన్నో రకాల పాత్రలతో అలరించారు. అంతే కాదు టీవీ సీరియళ్లలో ఆయన మంచి గుర్తింపు ఉంది. సింధుభైరవి, అపూర్వ సహోదరులు, నాయకన్‌, మైఖేల్‌ మదన కామరాజు, ఆహా, తెనాలి వంటి చిత్రాలకు ఆయనకు చక్కని గుర్తింపు తీసుకొచ్చాయి. ుపసి’(1979) చిత్రానికిగానూ తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన నటుడిగా కొనసాగారు. చివరిగా ఆయన ఈ ఏడాది విడుదలైన 'ఆరణ్మనై4', 'ఇండియన్‌2' చిత్రాల్లో కనిపించారు. (Rip Delhi Ganesh)

Ganehsa.jpg

మల్టీ టాలెండెట్‌..
నటుడిగా తమిళ, మలయాళ, హిందీ తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న సీరియళ్లలోనూ నటించారు. ఎన్నోమంది ఆర్టిస్ట్‌లకు డబ్బింగ్‌ చెప్పారు.  '47 నాట్కల్‌’ (47 రోజులు) చిత్రంలో చిరంజీవి పాత్రకు, గిరీశ్‌ కర్నాడ్‌ వంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. షార్ట్‌ ఫిల్మ్స్‌తోపాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించారు. తన కుమారుడు మహాను హీరోగా పరిచయం చేయడం కోసం 2016లో నిర్మాణ సంసంస్థను ప్రారంభించి 'ఎన్నుల్‌ అయిరమ్‌’ సినిమాను తీశారు.
ఢిల్లీ  గణేశ్‌ మరణ వార్తతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ సెలబ్రిటీలు  సంతాపాలు తెలియజేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:16 PM