Actress Vidya: నటి, కాంగ్రెస్ నేత దారుణ హత్య.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
ABN , Publish Date - May 22 , 2024 | 03:24 PM
కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్ధమాన సహాయ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్య సోమవారం రాత్రి తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది.
కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ వర్ధమాన సహాయ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దారుణ హత్యకు గురైంది. శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన భజరంగీ, వేద, వజ్రకాయ వంటి చిత్రాలతో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్య (36) (Actress Vidya) గత సోమవారం రాత్రి మైసూరు తుర్గనూర్‌లోని తన ఇంట్లో భర్త నందీష్ చేతిలో హత్యకు గురైంది. తర్వాత నందీష్ పరారవడంతో పోలీసులు ఆయన కోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడీ వార్త బెంగళూరులో, కన్నడ సినీ,రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
2018లో నందీష్, విద్య వివాహం చేసుకోగా.. కొద్ది నెలల్లోనే వారివురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో విడాకుల కోసం వారు ప్రయత్నాలు చేసిన్పటికీ వారి పెద్దలు కలుగజేసుకుని సర్ది జెప్పగా కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నారు. తిరిగి ఇటీవల వారి మధ్య గొడవలు ప్రారంభమై తీవ్ర రూపం దాల్చడంతో వారం పది రోజుల క్రితం విద్య బెంగళూరు సమీపంలోని తన తల్లిగారి ఊరైన శ్రీరాంపూర్‌కు వెళ్లి పోయింది.
అయితే ఈనెల 20న విద్యకు తన భర్తకు మధ్య ఫోన్‌లో వాదులాట జరిగింది. అది అంతటితో ఆగక పోవడంతో విద్య హుటాహుటిన ఆ రాత్రే మైసూరులోని ఇంటికి వెళ్లి అక్కడ ప్రత్యక్షంగా ఒకరికొకరు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన నందీష్ సుత్తితో విద్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నందీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ జంటకు ఇద్దరు కూతుర్లు సంతానం.
అయితే.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న స్థానిక బన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. సమీప ఇండ్లలోని వారి నుంచి, బంధువుల నుంచి సమాచారం సేకరించారు. ఇదిలాఉండగా జూనియర్ ఆర్టిస్ట్‌గా కేరీర్ స్టార్ట్ చేసిన విద్య అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు భారీ చిత్రాల్లో సహాయ పాత్రలు చేసేంత వరకు వచ్చింది.
ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అవుతున్న క్రమంలో విద్య ఇలా సడెన్‌గా హత్యకు గురి కావడం కన్నడ సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఇదిలాఉండగా సినిమాలతో పాటు రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న విద్య మైసూర్ సిటీ కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వహించడం విశేషం.